హైదరాబాద్: బాగ్‌లింగంపల్లిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణనష్టం సమాచారం లేదు. విఎస్‌టి సమీపంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం మంటలను ఆర్పేయడానికి అగ్నిమాపక సిబ్బంది, ఆరు అగ్నిమాపక శకటాలు నాలుగు గంటలు పనిచేశాయి. పెళ్లిలలో అలంకరణకు ఉపయోగించే సామాగ్రిని స్టోర్ చేసిన బిల్డింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనం నుంచి అగ్ని కీలలు పైకెగిసాయి, దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగబాకింది. ఆ చుట్టుప్రక్కల వారంతా చాలా సంక్షోభానికి గురయ్యారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ ఘటనా స్థలిని దర్శించారు. అగ్నిమాపక, పోలీసు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. ఆ గోడౌన్ ఎలాంటి సురక్షిత చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. మంటలను ఆర్పడానికి ఆ ప్రాంగణంలో ఎలాంటి సామాగ్రి కూడా లేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్కూట్ కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలావుండగా ‘వాణిజ్య భవనాలకు ఇదే తుది హెచ్చరిక’ అని మంత్రి అన్నారు.