Monday, December 23, 2024

వివాహేతర సంబంధాన్ని తిరిగి నేరంగా పరిగణించాలి…

- Advertisement -
- Advertisement -

కేంద్రానికి పార్లమెంటు స్థాయీ సంఘం సిఫార్సు

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాన్ని తిరిగి నేరంగా పరిగణించాలని ఎందుకంటే వివాహ వ్యవస్థ పవిత్రమైనదని, దాన్ని తప్పకుండా కాపాడాలని పార్లమెంటులో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహితపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పార్లమెంటు స్థాయీ సంఘం మంగళవారం సిపార్సు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత సెప్టెంబర్‌లో పార్లమెంటులో ఈ భారతీయ న్యాయసంహిత బిల్లును ప్రవేశపెట్టారు. భారత విక్షాస్మృతి( ఐపిసి), ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం తీసుకురానున్న మూడు బిల్లుల్లో ఇది ఒకటి. దీన్ని గత ఆగస్టులో పరిశీలనకోసం హోం వ్యవహారాల పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించారు.

బిజెపి ఎంపి బ్రిజ్‌లాల్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. కాగా ఈ బిల్లుపై డిసెంట్ నోట్స్ సమర్పించిన వారిలో కమిటీ సభ్యుడయిన కాంగ్రెస్ ఎంపి పి చిదంబరం కూడా ఉన్నారు. భార్యాభర్తల జీవితాల్లోకి ప్రవేశించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. బిల్లులకు సంబంధించి ఆయన మూడు మౌలిక అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ కొత్త బిల్లులు ప్రస్తుతం ఉన్నచట్టాలకు కాపీ పేస్ట్ మాత్రమేననేది ఇందులో ప్రధానమైనది. విడాకులు తీసుకోవడానికి వివాహేతర సంబంధం ఒక సివిల్ నేరంగా కారణం కావచ్చని, అయితే దాన్ని క్రిమినల్ నేరంగా భావించడానికి వీలు లేదని 2018లో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. భర్త భార్యకు యజమాని అని చెప్పే 163 ఏళ్ల నాటి వలసవాద పాలన నాటి కాలం చెల్లిన చట్టాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉండడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ చట్టం పురాతనమైది, ఏకపక్షమైనదే కాకుండా పితృస్వామ్యాన్ని సమర్థించేదిగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన బెంచ్ ఇది మహిళ స్వయంప్రతిపత్తిని, ఆత్మగౌరవాన్ని భంగపరిచేదిగా ఉందని వ్యాఖ్యానించింది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలనుంచి భారత్‌కు పూర్తి విముక్తి కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త చట్టాలను తీసుకురావాలని అనుకొంది. 2018లో సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ముందున్న చట్ట ప్రకారం భర్త అనుమతి లేకుండా వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి నేరం రుజువయితే అయిదేళ్ల శిక్ష విధించవచ్చు. అయితే ఆ మహిళను మాత్రం శిక్షించరాదని ఆ చట్ట పేర్కొంటోంది.

అయితే ఆ విషయాన్ని తొలగించి పాత చట్టాన్ని తిరిగి తీసుకు రావాలని హోం వ్యవహారాల స్థాయీసంఘం కోరుతోంది. అంతేకాదు దీన్ని లింగ తటస్థ నేరంగా పరిగణించాలని కూడా సూచించింది. అంటే అక్రమ సంబంధం వ్యవహారంలో స్త్రీ,పురుషులిద్దరూ శిక్షను ఎదుర్కోవాలనేది దాని అర్థం.అలాగే మరో బ్రిటీష్ కాలం నాటి చట్టమైన సుప్రీంకోర్టు పాక్షికంగా కొట్టివేసిన సెక్షన్ 377లో ఒకప్పుడు పరస్పర అంగీకారం లేని లైంగిక చర్యలను కూడా శిక్షార్హమైనవిగా తిరిగి తీసుకు రావాలని కూడా కమిటీ కేంద్రాన్ని కోరింది.

సెక్షన్ 377ను కూడా సుప్రీంకోర్టు 2018లో పాక్షికంగా కొట్టివేసింది. అయితే కొట్టివేసిన భాగాలు రాజ్యాంగంలోని 14, 15, 19, 21 అధికరణాలకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ ఇవి పెద్దవాళ్లతో పాటుగా చిన్నవాళ్లపైన పాల్పడే అసహజ లైంగిక కార్యకలాపాలకు వర్తిస్తున్నాయని కమిటీ పేర్కొంది. అయితే న్యాయసంహితలో ఇలాంటి వాటికి సంబంధించి ఎలాంటి నిబంధనను చేర్చలేదని కమిటీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News