సర్కారుకు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల వినతి
హైదరాబాద్ : ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) పథకం ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రలు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో స్వంత డబ్బులు పెట్టుకుని వైద్యం చేసుకోవడం పెన్షనర్లకు ఆశనిపాతంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చొరవ తీసుకుని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్ మెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రథమ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి పెన్షనర్స్ ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సెక్రటరీ జనరల్ సి. చంద్రశేఖర్‌తో కలిసి ప్రెసిడెంట్ జి. దామోదర్ రెడ్డి వెల్లడించారు. 2వ పిఆర్‌సి కమిటీని నియమించి వచ్చే నెల నుండి అమలు పరచి వెంటనే ఐఆర్‌ను ప్రకటించేలా చూడాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా మిగతా రెండు డిఆర్‌లను కూడా ప్రకటించాలని, పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ వ్యవధి 12 సంవత్సరాలకు కుదించడంతో పాటు , దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను సకాలంలో ఇవ్వడంతో పాటు పెన్షనర్లకు ఒకటో తేదీనే వేతనాలు అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వపరంగా సానుకూల నిర్ణయం వెలువడని పక్షంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పక్షంగా ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని చెప్పదలుచుకున్నామని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సంఘం నేతలు ఏ గంగారెడ్డి, వి. విశ్వనాథం, జి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్. సీతారామయ్య, జి. మోహన్ రెడ్డి, పిఆర్ ఆర్ మోహన్, పి. శ్రీహరిరెడ్డి, శ్యాం రావు తదితరులు పాల్గొన్నారు.