Monday, December 23, 2024

తొర్రూరు పట్టణాన్ని రాష్ట్రంలోనె నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : అంచలంచెలుగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకునే విధంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ధి వేడుకల్లో భాగంగా పట్టణ ప్రగతి ఉత్సవాల సందర్భంగా తొర్రూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా మంత్రి దయాకర్‌రావు ట్రాక్టర్‌ను నడుపుతూ మహిళల బతుకమ్మ, బోనాలు, వాహనాలు, డప్పు చప్పుళ్ల నడుమ భారీ ర్యాలీతో ఎల్‌వైఆర్ గార్డెన్‌లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి ఉత్సవాల కార్యక్రమానికి వచ్చారు. మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి మంత్రి దయాకర్‌రావు పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. అందులో భాగంగానే తొర్రూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు.

గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా తొర్రూరు ఉన్నప్పటికీ ఎలాంటి వసతులు లేకుండా అస్తవ్యస్థంగా ఉండేదని, 2018లో తొర్రూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకొని సిఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో వారి చొరవతో రూ.వంద కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధ్ది చేసుకున్నామని చెప్పారు. మరో రూ.150 కోట్ల నిధులతో త్వరలోనే పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని దీంతో తొర్రూరు పట్టణ రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. రూ.27కోట్లతో పట్టణంలో త్వరలో ఇంటింటికి రూ.27కోట్లతో 24గంటల పాటు మంచినీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రూ.కోటితో ప్రగతి పనులు జరుగుతున్నాయన్నారు. రూ.14కోట్లతో వర్షపు నీటిని వడిసిపట్టే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. రూ.రెండు కోట్లతో దోబీ ఘాట్‌లు నిర్మాణం అవుతాయని, తొర్రూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.

మరో రూ.ఐదు కోట్లతో అంబేద్కర్ భవన్, బేడ బుడగ జంగాల భవన్ కమ్యూనిటీ హాల్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా తొర్రూరు పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. కష్టకాలంలో తనను ఆదుకున్నందున మీ రుణం తీర్చుకుంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పట్టణ ప్రగతి ఉత్సవాల సందర్భంగా తొర్రూరు పట్టణంలోని నిర్వహించిన భారీ ర్యాలీ కుట్టు మిషన్ల పంపిణీ, పారిశుద్ధ కార్మికులు, సిబ్బంది, అధికారులకు మంత్రి దయాకర్‌రావు సన్మానించారు. ముం దుగా బస్టాండ్ నుండి నిర్వహించిన భారీ ర్యాలీలో పట్టణ మున్సిపాలిటీ ట్రాక్టర్ మంత్రి దయాకర్‌రావు నడిపారు. అనంతరం సభలో ఏర్పాటు చేసిన రెండవ విడత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పట్టణ కేంద్రంలో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, బస్తీ దవాఖానాకు ప్రారంభించారు. స్మశాన వాటికలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేవూరి సోమయ్య స్మారకార్థం ఏర్పా టు చేసిన గదిని మంత్రి దయాకర్‌రావు ప్రారంభించారు.

దేశంలోనే 31 స్థానంలో ఉన్న తొర్రూరు మున్సిపాలిటీ : అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
దేశంలోనే తొర్రూరు మున్సిపాలిటీ 150వ స్థానం నుంచి 31వ స్థానంలో పచ్చదనంతో అద్భుతమైన అభివృద్ధి పనులు, నిర్మాణాలతో తొర్రూరు ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుందని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గ్రీనరీలో ముందంజలో ఉందని, గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ తరువాత ఎక్కువ నిధులతో అభివృద్ధి చేసుకొని పట్టణ నలు దిశల అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రణాళికబద్దంగా భవిష్యత్తు అవసరాలకు ప్రజలకు అనుగుణంగా పట్టణ నిర్మాణం అభివృద్ధి, సంక్షేమంలో తొర్రూ రు మున్సిపాలిటీ ముందుంటుందని, ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రతీ ఒక్కరు పరిశుభ్రతను విధిగా పాటించాలన్నారు.

అనంతరం మున్సిపాలిటీ సిబ్బం ది సేవలను గుర్తించి శాలువాలు, షీల్డ్‌లతో మంత్రి దయాకర్‌రావు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్ రాంచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్‌లు సత్కరించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేవూరి సోమయ్య స్మారకార్థం రూ.ఎనిమిది లక్షలతో ఏర్పాటు చేసిన భవనాన్ని, పట్టణ శివారులోని అంగడి ప్రాంతంలో రూ.ఇరవై లక్షలతో నిర్మించిన ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను, ఎస్‌బీఐ బ్యాంకు వెనుక ఉన్న రూ.ఇరవై లక్షలతో నూతన బస్తీ దవాఖానా కోసం నిర్మాణ పనులను మంత్రి దయాకర్‌రావు, అదనపు కలెక్టర్ అభిలాష అభనవ్‌లు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఆర్డీఓ ఎల్.రమేశ్, మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్, తహశీల్దార్ నాగేంద్రప్రసాద్, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వైద్యాధికారులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News