Thursday, January 9, 2025

కించపరిస్తే సహించం

- Advertisement -
- Advertisement -

 మాలలు దోచుకుంటున్నారని
30ఏళ్లుగా దుష్ప్రచారం
రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర
జరుగుతోంది అంబేద్కర్‌ను
విమర్శిస్తే ఖబడ్దార్
వర్గీకరణపై సుప్రీం తీర్పు
ఆర్టికల్ 341కి వ్యతిరేకం
పార్లమెంట్‌లో చర్చ జరగాలి
మాలల సింహగర్జన సభలో
వక్తల ఉద్ఘాటన

మన తెలంగాణ / హైదరాబాద్ : మాలల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ వివేక్ వెంకటస్వామి అన్నారు. తమను మాలలు దోచుకుంటున్నారని గత 30 ఏళ్లుగా దుష్ప్రచారం జరుగుతోందని ఇలాంటి ప్రచారానికి ఇక సహించేది లేదని హెచ్చరించారు. ఆదివారం సికిందరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో మాలల సింహగర్జన సభలో లక్షలాది మంది మాలల నుద్దేశించి ఆయన ప్రసంగించారు. డా.బిఆర్ అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్‌లు కల్పించి రాజ్యాంగ రక్షణ కల్పిస్తే ఇప్పుడు కేంద్రంలోని ప్రభుత్వం రిజర్వేషన్‌లను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మాలల సింహా గర్జనకు ఎంతో మంది అవహేళన చేశారని, కాని సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల నుండి పెద్దఎత్తున తరలివచ్చి న మాలలు సభను విజయవంతం వివేక్ అన్నారు.

మాలల సింహా గర్జన సభకు ఇంత జనం హాజరవుతారని ఎవరూ ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు. మన ఆత్మ గౌరవాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. దేశంలో 3 వేల ఏండ్ల నుంచి కుల వివక్ష కొనసాగుతోందని, దళితులకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక గౌరవం, ఆర్థిక స్వాలంబన కోసం అంబేద్కర్ ఆలోచించారని అన్నారు. కుల వివక్ష చూసే అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారని, నేడు ఆ రిజర్వేషన్‌లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని అన్నారు. క్రిమిలేయర్ అందులో భాగమేనన్నారు. మాలల బలమేమిటో ఈ సభ ద్వారా నిరూపించుకున్నామన్నారు.

దళిత సమాజం గురించి అంబేద్కర్ ఆలోచించారు. తన తండ్రి కాకా వెంకటస్వామి దళితుల కోసం పోరాటం చేశారు.. అందులో మాల, మాదిగ చూడలేదు. ఇప్పుడు కాకా అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నానని అన్నారు. అంబేద్కర్ ను విమర్శిస్తే మాలలు ఊరుకోరు ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. మాలలు అంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మాలలు తక్కువగా ఉన్నారని ఇన్నాళ్లు భావించారని ఈ సభకు వచ్చిన జనమే అలాంటి వాళ్లకు చెంపచెట్టులాంటిదన్నారు. రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చిన్నచూపు ఉందని, అలాంటి రాజకీయ పార్టీలకు చెంపపెట్టు ఈ సింహగర్ఝన సభ అన్నారు. మాలలకు అన్ని రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని అన్నారు. మంత్రి పదవి కోసం మాలల పోరాటం చేస్తున్నామని కొందరు అంటున్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తినని, పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గతంలో కెసిఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. ఎన్నో పదవులు ఇస్తాం అంటూ ఆఫర్ వచ్చాయని అన్నింటినీ తృణపాయంగా విడిచి పెట్టానని చెప్పారు. మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఈడీ దాడులు చేసినా వెనక్కి తగ్గలేదని అన్నారు. మీ అందరికి మేము అండగా ఉన్నామని మాలలకు భరోసో కల్పించారు.

వర్గీకరణ పేరుతో ఐక్యతను దెబ్బ తీసే కుట్ర: ఎంపి మల్లు రవి
ఎస్‌సి వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై నే మాలల పోరాటమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రిజర్వేషన్ ఫలాల వల్లే సమాజంలో ఎస్‌సిలు కొంత ముందుకు వచ్చారని అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ మనల్ని ఇంకా వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని ఆయన కోరారు. మాల, మాదిగ కులాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలనే ఈ సభ నిర్వహించామని తెలిపారు.

మనం గర్జిస్తే ఢిల్లీ ప్రధాని సీటు కదలాలి: పాశ్వాన్

ఎస్‌సి వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయంపై మాలలు ఉద్యమిస్తారని తేలిపోయిందని, ఢిల్లీ నుంచి వచ్చిన పాశ్వాన్ అన్నారు. పార్లమెంట్ లో మాలల గురించి చర్చ జరగాలని చెప్పారు. బహుజన దళితుల కోసం పోరాటం చేస్తున్నామని, తెలంగాణ, ఏపీలో కాదు ఢిల్లీలో చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీ వరకు మాలల పోరాటం చేరితే మోడీ కుర్చీ కదలాలని పాశ్వాన్ నినదించారు. మాలలు ఏకం కావడంతో మైదానం సరిపోలేదని, దేశంలోనే ఇంత మంది మాలలు ఒకే చోట చేరడం ఇదే మొదటి సారి అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Mala mahanadu

మాల జాతిని కాపాడే బాధ్యత మాపై ఉంది: ఎంఎల్‌ఎ వినోద్

మాలల కోసం తమ కుటుంబం ఎంత కష్టపడుతుందో అందరికీ తెలుసని ఎంఎల్‌ఎ వినోద్ అన్నారు. అందుకోసమే మాల కులాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందని ఆయనన్నారు. ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని.. ఆ తీర్పును వ్యతిరేకించేందుకు మీరంతా ఇవాళ ఇక్కడికి వచ్చారని అన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ఎక్కువ దోచుకు తింటున్నారని విమర్శలు చేయడం సరికాదని, మాలలు ఎవరిదేం దోచుకున్నారని ప్రశ్నించారు. మా నాన్న కాకా వెంకటస్వామి కూడా మాలల అభ్యున్నతి కోసం కృషి చేశారని.. ఆయన బాటలోనే మాలల హక్కుల కోసం మేం పోరాడుతామని స్పష్టం చేశారు. కాగా, పరేడ్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన మాలల సింహ గర్జన సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎపి, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుండి జనం తండోపతండాలుగా తరలిరావడంతో పరేడ్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News