Saturday, November 16, 2024

రాష్ట్రంలో మలబార్ గోల్డ్ భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

Malabar Gold is a huge investment in Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో జ్యువెల్లరీ తయారీలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో మలబార్ గోల్డ్, డైమండ్స్ సంస్థ మహేశ్వరంలో ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్ మోడల్ బిల్డింగ్‌కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఐటి, ఫార్మా, ఏరోస్పేస్, డేటా సెంటర్, లాజిస్టిక్స్ మొదలైన అన్ని రకాల రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మలబార్ రిఫైనరీ జ్యువెల్లరీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులతో పాటు.. 2750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలో బహుమతులుగా బంగారం, వెండి, వజ్రాభరణాలు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం ఉందని చెప్పారు. ఫలితంగా జ్యువెల్లరీ రంగానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో నారాయణపేట్, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో జ్యువెల్లరీ తయారీలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని మంత్రిపేర్కొన్నారు. ప్రపంచంలోనే 6వ అతి పెద్ద జ్యువెల్లరీ తయారీనగరంగా హైదరాబాద్ పేరు పొందిందని కెటిఆర్ అన్నారు. రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడులు, తయారీ రంగాలకు కేంద్రంగా నిలుస్తుందన్నారు.

మేక్ ఇన్ ఇండియా.. మార్కెట్ టు ది వరల్డ్ ..

మహేశ్వరంలో 3.7 ఎకరాల్లో తాము నిర్మిస్తున్న ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రతి ఏటా 10 టన్నుల బంగారం.. 1,5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు చేయగల సామర్థ్యం ఉందని మలబార్ సంస్థ చైర్మన్ అహ్మద్ ఎంపి తెలిపారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 180 టన్నుల వార్షిక బంగారు శుద్ధి సామర్థ్యం కూడా ఈ కేంద్రం కలిగి ఉందన్నారు. ఈ కేంద్రంలో బంగారం, వజ్రాలు విలువైన రత్నాలు, ప్లాటినం, అన్కట్ డైమండ్స్ సహా అనేక రకాల ఆభరణాలను తయారు చేస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మార్కెట్ టు ది వరల్డ్ అనే విధంగా తయారీ ఉంటుందన్నారు. రానున్న 30వ వార్షికోత్సవంలోగా తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 17 రిటైల్ షోరూమ్స్‌ను ప్రారంభించి.. వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

దేశవ్యాప్తంగా 60 షోరూమ్‌లు.. విదేశాలలో 37 షోరూములు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆదాయంలో 25 రెట్ల వృద్ధి సాధించి రూ.75,000 కోట్ల ఆదాయంతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ గా అవతరించే లక్ష్యంతో ఈ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. సంస్థకు విదేశాల్లో 5 తయారీ యూనిట్లు, భారత్‌లో తొమ్మిది తయారీ యూనిట్లు ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, పరిశ్రమల డైరెక్టర్ కృష్ణభాస్కర్, ఎండి నర్సింహారెడ్డి, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం కెపి. ఎండి అషర్, ఈడి నిషాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News