Saturday, November 23, 2024

రాష్ట్రం మెడలో బంగారు నగ

- Advertisement -
- Advertisement -

Malabar Group to invest ₹750 crore in Telangana

రూ.750 కోట్ల పెట్టుబడితో గోల్డ్, డైమండ్ జ్యూయలరీ ఫ్యాక్టరీ, రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్
2500 మందికిపైగా నిపుణ స్వర్ణకారులకు ఉపాధి అవకాశం
రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, మానవ వనరులు దండిగా ఉన్నాయి : మలబార్ గ్రూప్
ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని హామీ ఇస్తూ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తం రూ. 750 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు సముఖతను వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్, డైమండ్ జ్యుయలరీ తయారీ ఫ్యాక్టరీ, గోలల్డ్ రిఫైనరీ యూనిట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. బుధవారం నగరంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో మలబార్ గ్రూప్ అధినేత ఎంపి అహ్మద్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడి పట్టేందుకు సముఖంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కు వివరించింది.

రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న స్నేహపూర్వక దృక్పధాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మలబార్ గ్రూప్ సంస్థ అభినందించింది. తమ గ్రూప్స్‌కు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, రాష్ట్రంలో తాము ప్రతిపాదిస్తున్న ఈ పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యుయలరి మాన్యుఫాక్చరింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది.

కంపెనీ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కెటిఆర్

రాష్ట్ర ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడి ఉన్న వ్యాపార అనుకూలతలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ సంస్థకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు లభించడం అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళ నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. మలబార్ గ్రూప్ తమ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అందిస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడి దారులకు రాష్ట్ర ప్రభుత్వం స్నేహ పూర్వక సహకారం అందిస్తునన కారణంగానే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టిఎస్ ఐపాస్ విధానం దేశంలో మరెక్కడ లేదన్నారు. దీని కారణంగానే కేవలం ఆరు సంవత్సరాల్లోనే తెలంగాణకు వచ్చిన పరిశ్రమలుగానీ, పెట్టుబడులుగానీ మరో రాష్ట్రానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. అనతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిగా ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. అలాగే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా…ఒక నమ్మకం, విశ్వాసం కల్పిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దేశ, విదేశాలకు చెందిన అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిని చూపుతున్నాయని అన్నారు. ఇదే స్పూర్తి, ఉత్సాహంతో మునుముందు కూడా పనిచేసి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధిస్తామన్నారు. అలాగే పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో పాటు, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News