Sunday, October 6, 2024

పునరావాసానికి పూచీ మాది

- Advertisement -
- Advertisement -
  • మూసీ నిర్వాసితులందరికీ తప్పకుండా ప్రత్యామ్నాయం చూపిస్తాం
  • పేదల ఇళ్ల కోసం అవసరమైతే మలక్‌పేట రేస్‌కోర్స్, అంబర్‌పేట పోలీస్ అకాడమీని హైదరాబాద్ బయటకు తరలిస్తాం
  • కెసిఆర్, కెటిఆర్ మీ వేలాది ఎకరాల్లోంచి భూదానం చేస్తే పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటా
  • విపక్ష నేతలు సచివాలయానికి వచ్చి సూచనలు ఇవ్వండి 
  • రూ.2లక్షలపై ఉన్న రుణమాఫీ కోసం రైతులు కలెక్టర్లను కలవాలి
  • సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తే జైల్లో చిప్పకూడు తినడం ఖాయం
  • కాకా జయంతి వేడుకల్లో సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు, బఫర్ జోన్‌లోని బాధితులకు ప్రభుత్వం తప్పకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తుందని సిఎం అన్నారు. విపక్షాల ఆరోపణలను నమ్మవద్దని సిఎం సూచించారు. ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని, అందరిని ఆదుకుంటామని రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన వెంకటస్వామి 95వ జయంతి వేడుకలకు సిఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ రివర్‌బెడ్, బఫర్‌జోన్‌లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రత్యామ్నాయం చూపిస్తామని వాళ్లకు ఇల్లు, స్థలం ఇస్తామని నష్టపరిహారం ఇవ్వటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మూసీ ప్రాజెక్టుపై ప్రతిపక్షాల సూచనలు ఇవ్వాలన్నారు. సబర్మతి కట్టినప్పుడు చప్పట్లు కొట్టారని ఈటల రాజేందర్ తమ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చన్నారు. 100 ఏళ్ల క్రితమే నిజాం సర్కారు హైదరాబాద్ ఒకరూపును తీసుకొచ్చారన్నారు. 20ఏళ్ల ప్రతిపక్ష నేతగా ఇల్లు కోల్పయిన పేదల బాధ తెలియకుండానే తాను ఇంతదూరం రాలేదన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఫోర్త్ సిటీ నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్ పార్టీ ఫండ్ నుంచి నిధులు ఇవ్వాలి

కెటిఆర్, హరీశ్‌రావు, రాజేందర్‌లతో కమిటీని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సచివాలయానికి వచ్చి తమ అనుభవాలతో సలహాలివ్వాలని, అదే తీర్మానాన్ని అసెంబ్లీలో పెడదామని సిఎం తెలిపారు. లేదంటే మూసీ ప్రక్షాళన వద్దు మూసేద్దామని చెబితే అదైనా చెప్పాలని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.1,500 కోట్ల బిఆర్‌ఎస్ పార్టీ తమ నిధి నుంచి రూ. 500 కోట్లు ఇవ్వాలని, గజ్వేల్‌లో కెసిఆర్‌కు ఉన్న 1,000 ఎకరాల నుంచి 500ఎకరాలను భూదానం చేయాలని, కెటిఆర్‌కు సంబంధించిన జన్వాడ ఫాంహౌజ్ లో ఉన్న 50ఎకరాల్లో 25ఎకరాలను ఇస్తే పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత తాసు తీసుకుంటానని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పిల్లల ప్రాణాలు పోతే రాష్ట్రం వచ్చాక కెటిఆర్, కెసిఆర్, హరీశ్‌ల ఆస్తులు గుట్టలుగా పెరిగిపోయాయన్నారు. పేదల ఇళ్ల కోసం అవసరమైతే మలక్‌పేట రేస్ కోర్సును, అంబర్‌పేట పోలీస్ అకాడమీని సిటీ బయటకు తరలిస్తామని, మీరు వచ్చి సూచనలు చేయాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌లను కలవండి

రైతు రుణమాఫీ కాలేదని బిఆర్‌ఎస్ ఈ రోజు ధర్నా చేస్తోందని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ కాలేదని, వారికి కూడా త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీపై సమస్యలుంటే కలెక్టరేట్ ఫిర్యాదు చేయాలని సిఎం సూచించారు. రుణమాఫీలో రైతులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్‌లను కలవాలని, రోడ్డెక్కవద్దని సిఎం సూచించారు. బిఆర్‌ఎస్ నాయకులను నమ్ముకొవద్దన్నారు. కష్టపడి తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంపై అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్ నేతలు అడ్డగోలుగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని సిఎం మండిపడ్దారు.

సోషల్ మీడియాను నమ్ముకుంటే జైలుకే

సోషల్ మీడియాను నమ్ముకొని అధికారంలోకి వస్తామని కెటిఆర్ కలలు కంటున్నారని, సోషల్ మీడియాతో అధికారంలోకి రారని, చిల్లర పనులు చేస్తే మాత్రం చర్లపల్లి జైలులో చిప్పకూడు తినడం ఖాయమని తాను గ్యారంటీగా ఈ విషయాన్ని చెబుతున్నానని సిఎం హెచ్చరించారు. కాళేశ్వరం పేరుతో మీ కుటుంబం లక్ష కోట్లు మింగిందని, ఈ మూసీ నిర్వాసితుందరిని ఆదుకోవడానికి రూ.10వేల కోట్లు కావని, ఆ 10వేల కోట్లు లేని దరిద్రంలో ఈ ప్రభుత్వం లేదన్నారు. పదేళ్లలో రూ.11వేల కోట్లు రుణమాఫీ చేస్తే పాతిక రోజుల్లో తాము రూ.18వేల కోట్ల మాఫీ చేశామని సిఎం తెలిపారు.

సింగరేణిని కాపాడిన ఘనత కాకా

కాకా ప్రజల ఆస్తి అని, పేదోళ్ల ధైర్యం అని సిఎం రేవంత్ రెడ్డి కీర్తించారు. సింగరేణిని కాపాడిన ఘనత కాకాకే దక్కుతుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సింగరేణిని కాపాడటానికి కాకా అప్పట్లో రూ. 450 కోట్లను అప్పు ఇప్పించి దానిని నిలబెట్టారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఈ బువ్వ తింటున్నారు అంటే అది కాకా చలవేనన్నారు. హైదరాబాద్‌లో కాకా పేదలకు 80 వేల ఇళ్లు ఇప్పించారని, అలాగే అణగారిన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించిన ఘనత కాకాకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కాకా సేవలను సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుబోయే నిర్ణయాల్లో కాకా వెంకటస్వామి కుటుంబం పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాకా ఫ్యామిలీ నుంచి సహకారం తీసుకుంటామని రేవంత్ చెప్పారు. ఇది పార్టీ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు.

దేశంలో నెహ్రూకు, వెంకటస్వామిలకే గుర్తింపు

నెహ్రూను చాచా అంటే, వెంకటస్వామిని కాకా అనే గుర్తింపు దేశంలో వీళ్లిద్దరికే ఉందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీలోని కాకా ఇళ్లే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా ఉందన్నారు. ఇందిరాగాంధీ కుటుంబానికి వెంకటస్వామి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించామని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను కాకా కుటుంబం సద్వినియోగం చేసుకుందని సిఎం తెలిపారు. ప్రాణహిత చేవెళ్లకు వెంకటస్వామి సూచనతోనే అంబేద్కర్ పేరు పెట్టారని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వెంకటస్వామి ఆలోచన అని ఆ కార్యక్ర మాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తమపై ఉందని రేవంత్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి నేతల్లో కాకా ఒకరని రేవంత్ అన్నారు. కాకా జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్లు అసూయతోనో, ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేశారని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కోసమే కాంగ్రెస్‌తో బిఆర్‌ఎస్‌కు పొత్తు కుదిర్చారని సిఎం చెప్పారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించామని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను కాకా కుటుంబం సద్వినియోగం చేసుకుందని సిఎం తెలిపారు.

పేదలకు నష్టం చేకూర్చే విధంగా రాజకీయం చేస్తే ఊరుకోం

మూసీ నిర్వాసితులందరూ పేదలు అని, జీవనోపాధి కోసం, ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చారని, అలాంటి లక్షల మందిని అప్పట్లో కాకా వెంకటస్వామి ఆదుకొని ఆశ్రయం ఇచ్చారన్నారు. ప్రతిపక్షాలు పేదలకు నష్టం చేకూర్చే విధంగా రాజకీయం చేస్తే ఊరుకోమని సిఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మూసీని ఇలాగే వదిలేస్తే భవిష్యత్ లో నగరానికి వరద ముప్పు పొంచి ఉంటుందని వికారాబాద్ నుంచి వచ్చే వరద సిటీని ముంచెత్తే ప్రమాదం ఉందని సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో 1,200, 1,400ల ఫీట్ లోపల బోర్ వేయకుండా ఎక్కడా నీళ్లు రావడం లేదని సిఎం తెలిపారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయిందని గ్రౌండ్ వాటర్ పడిపోయిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ మురికితో మూసీ నిండిపోయి ఆ విషవాయువులు నల్గొండ ప్రజలకు విషంగా మారుతోందన్నారు. నల్గొండను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తమదేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరిమీద కోపం కానీ, పట్టింపులు కానీ, లేవని, కేవలం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదని సిఎం పేర్కొన్నారు.

గుజరాత్ ఒకలా హైదరాబాద్‌లో మరోలా బిజెపి స్టంట్….

గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సమయంలో 60 వేల కుటుంబాలను మోడీ ప్రభుత్వం ఖాళీ చేయించిందని అందులో కేవలం 16 వేల కుటుంబాలకే సాయం చేసిన విషయాన్ని సిఎం రేవంత్ గుర్తు చేశారు. గుజరాత్ ఒకలా హైదరాబాద్ లో మరోలా బిజెపి నాయకులు ఎలా మాట్లాడతారంటూ సిఎం రేవంత్ బిజెపి నేతలకు సిఎం చురకలు అంటించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సత్తా ఉందా అని బిజెపి నేతలను ఆయన ప్రశ్నించారు.

అంబేద్కర్ ఆశయాలను కాకా నెరవేర్చారు: ఎమ్మెల్సీ కోదండరాం

ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ విద్యాసంస్థల ద్వారా అంబేద్కర్ ఆశయాలను కాకా నెరవేర్చారని ఆయన చెప్పారు. తెలంగాణ మలి దశ పోరాటంలోనూ ఆయన కృషి మరువలేనిదన్నారు.ఎన్ని కష్టాలొచ్చినా కాంగ్రెస్‌ను వీడలేదని, కాకా జీవితంపై డాక్యుమెంటరీ తీసుకురావాలని కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కాకా అద్భుత శక్తి అని కోదండరాం చెప్పారు. బలహీన వర్గాల కోసం కాకా వెంకటస్వామి అలుపెరగని పోరాటం చేశారని ఆయన సేవలను కొనియాడారు. ప్రాణహిత ప్రాజెక్టు కార్యరూపానికి కాకానే కారణమని మధుయాష్కీ చెప్పారు. దివంగత నేత కాకా మనందరికీ మార్గదర్శి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. పేద విద్యార్థుల కోసమే అంబేద్కర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివేక్ గుర్తుచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News