భర్త అస్సర్‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో
షేర్ చేసుకున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
లండన్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో గల తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈ మేరకు 24 ఏళ్ల మలాలా తన జీవిత భాగస్వామి అస్సర్‌తో కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. అస్సర్, నేను జీవిత భాగస్వాములమయ్యాం. బర్మింగ్‌హామ్‌లోని మా ఇంట్లో ఇరువురి కుటంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు అందించండి. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని సాగించడానికి సంతోషంగా ఉన్నాం’ అని మలాలా ట్వీట్ చేశారు.
అస్సర్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్యకోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు స్కూలు బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులకు దిగారు. మలాలా ఎడమ కణితిపై, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే బుల్లెట్ గాయాల కారణంగా మెరుగైన చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్ర చికిత్సల అనంతరం మలాలా కోలుకున్నారు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి బ్రిటన్‌లోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. ఇక అప్పటినుంచి మలాలా బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్ పేరుతో బాలికల విద్య కోసం చారిటీ సంస్థను నెలకొల్పారు.ఈ క్రమంలో మలాలా సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ 2014లో ఆమెకు పోబెల్ శాంతిబహుమతిని అందించింది. భారత్‌కు చెందిన బాలల హక్కుల ఉద్యమనేత కైలాష్ సత్యార్థితో కలిసి ఆమె ఈ బహుమతిని పంచుకున్నారు.
దీంతో 17 ఏళ్ల వయసులోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా వార్తల్లో నిలిచారు. 2020లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీనుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ అందుకున్నారు. కాగా మలాలా భర్త అస్సర్ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైపెర్ఫార్మెన్స్ సెంటర్‌లో పని చేస్తున్నారు. గత ఏడాది మే నెలలో ఆయన పాక్ క్రికెట్ బోర్డులో ఉద్యోగిగా చేరారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న ముల్తాన్ సుల్తాన్ జట్టుకు ఆపరేషనల్ మేనేజర్‌గా కూడా పని చేశారు. గతంలో అస్సర్ మాలిక్ ప్లేయర్ మేనేజ్‌మెంట్ ఏజన్సీని కూడా నడిపారు. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్‌నుంచి 2012లో రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రంనుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.