కరాచి (పాకిస్థాన్ ) : పాకిస్థాన్‌లో వరద ప్రళయంతో విపరీతంగా నష్టపోయిన బాధితులను కలుసుకుని పరామర్శించడానికి నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ నాలుగేళ్ల తరువాత పాకిస్థాన్‌కు మంగళవారం అరుదెంచారు. గత జూన్ లో పాకిస్థాన్ లో అకాల వర్షాలకు వరదల ప్రళయం కారణంగా మూడొంతుల దేశం జలమయం కావడమే కాకుండా 1700 మంది మృతిచెందారు. 33 మిలియన్ మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల 40 బిలియన్ డాలర్ల వరకు ఆర్థికంగా పాకిస్థాన్ నష్టాలను ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మలాలా పాకిస్థాన్ రావడంలో ప్రధాన లక్షం పాకిస్థాన్ బాధితులను ఆదుకోడానికి ప్రపంచ దేశాలు సహాయం అందించేలా అప్రమత్తం చేయడానికే. ఇంతకు ముందు మలాలా ఫండ్ నుంచి అత్యవసర సహాయం కింద పరద సహాయ కార్యక్రమాల కోసం నిధులు మంజూరయ్యాయి.
బాలికల , యువతుల సంక్షేమం కోసం ఈ నిధులు వెచ్చించారు. పాకిస్థాన్‌లో వరద బీభత్సంతో రాత్రికి రాత్రే కొన్ని లక్షల మంది జీవితాలు చిన్నాభిన్నం కావడం చూడగానే తన గుండె పగిలిందని మలాలా ఆవేదన వెలిబుచ్చారు. ఈ విపత్తులో అంతర్జాతీయ సమాజం స్పందించి జాలితో సహాయం చేయడమే కాకుండా, వాతావరణ మార్పులను నియంత్రించే విధానపరమైన తక్షణ చర్యలు చేపట్టేలా సహకరించాలని కోరారు. వాతావరణ నియంత్రణకు కావలసిన ఆర్థిక వ్యవస్థలను నెలకొల్పాలని కోరారు.