79 శాతం తగ్గిన మలేరియా మరణాలు : మలేరియా నోమోర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో 2015 నుంచి మలేరియా కేసులు 86 శాతం వరకు తగ్గాయని , అలాగే 2015 నుంచి 2021 వరకు మరణాలు కూడా 79 శాతం తగ్గాయని మలేరియా నో మోర్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది.“ మలేరియా నిర్మూలన కోసం ముందుకు సాగుతున్న భారత్ ” అనే శీర్షిక కింద ఈ అధ్యయనం విడుదలైంది. 2017 నుంచి 2019 వరకు భారత్ తన బడ్జెట్‌లో మలేరియా నిర్మూలన కోసం రెట్టింపు నిధులు కేటాయించిందని, మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మలేరియా వ్యాధిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టిందని పేర్కొంది. పంపిణీ చేసిన మొత్తం 9 కోట్ల దోమతెరల్లో 2019 నుంచి 2021 వరకు 4.8 కోట్ల తెరలు పంపిణీ అయ్యాయని ప్రశంసించింది.
2030 నాటికి దేశం నుంచి పూర్తిగా మలేరియాను నిర్మూలించాలని భారత్ లక్షంగా పెట్టుకున్నా ఈ డ్రైవ్‌లో ప్రైవేట్ రంగం, సామాజిక సమాజాలు, వ్యక్తుల నుంచి భాగస్వామ్యం పొందడం ఇంకా కీలకమైన సవాళ్లుగానే ఉంటున్నాయి. భారత్‌లో మలేరియా అన్నది పేదల వ్యాధిగా ప్రచారం ఉంటోంది. అందువల్ల ప్రజారోగ్య అజెండాలో తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకని ప్రభుత్వం దీని నిర్మూలను తగిన చర్యలు ముమ్మరం చేసిందని మలేరియా నోమోర్ సంస్థ కంట్రీ డైరెక్టర్ ప్రతీక్ కుమార్ పేర్కొన్నారు. మలేరియాపై ఇక్కడ బుధవారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఒక్కదాని వల్లనే ఈ లక్షం నెరవేరదని సమాజం లోని అన్ని వర్గాల నుంచి విస్తృత సహకారం లభిస్తేనే 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడమౌతుందని సూచించారు.