కౌలాలంపూర్: మలేసియా సంకీర్ణ ప్రభుత్వంలో మెజార్టీ మద్దతు కోల్పోవడంతో ప్రధాని ముహిద్దీన్ యాసిన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. 17 నెలల పాటు ప్రధాని పదవిలో ఉన్న ఆయన తన వైఫల్యాలకు క్షమాపణ చెప్పారు. కానీ అధికార దాహంతో కొందరు ఉన్నారని వ్యాఖ్యానించారు. పరిపాలించడానికి కావలసిన మెజార్టీ కోల్పోయానని ఆయన ఒప్పుకున్నారు. తక్కువ కాలం పాలించే నేతగా మిగిలారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేవరకు , ఆర్థికంగా కోలుకున్న వరకు తాను పదవిలో ఉంటానని ఆశించానని, కానీ అధికార దాహంతో ఉన్న వారు తనను నిరోధించారని ఆరోపించారు. ఆర్థిక మాంద్యం, కరోనా కేసులతో మలేసియాలో అనిశ్చితి నెలకొంది.
అయితే ఇప్పుడు ముహిద్దీన్ రాజీనామాతో పరిస్థితి ముఖ్యంగా కరోనా నియంత్రణ మరింత అధ్వాన్నమౌతుందని, కొత్త సంక్షోభం ఎదురవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్‌షా, ముహిద్దీన్ రాజీనామాను అంగీకరించినట్టు రాజ ప్రాసాద వర్గాలు తెలిపాయి. కరోనా విలయం కారణంగా అనేక ప్రాంతాలు దేశం లోని అనేక ప్రాంతాలు కొవిడ్ రెడ్ జోన్లలో ఉన్నందున, వైద్య సౌకర్యాలు లోపించినందున కొత్తగా ఎన్నికలకు ఇప్పుడు అవకాశం లేదని సుల్తాన్ అబ్దుల్లా షా వెల్లడించారు. దేశ ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ పరిపాలనా విధానాన్ని విచ్ఛిన్నం చేసిన రాజకీయ సంక్షోభం త్వరగా పరిష్కారమౌతుందని ఆయన ఆశించారు.