సింగపూర్ : సింగపూర్‌లో మానసిక స్థితి సరిగ్గా లేని భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె. ధర్మలింగం (34)ను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరి తీసింది. 42.72 గ్రాముల హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తున్నాడనే నేరంపై కోర్టు 2010 లో మరణ శిక్ష విధించింది. దాదాపు పదేళ్ల పాటు మృత్యుముఖంలో ఉన్న నాగేంద్రన్ తనపై నేరారోపణలను కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించగా, ఆ అప్పీల్‌ను 2011 సెప్టెంబరులో న్యాయస్థానం తోసిపుచ్చింది. ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని 2015 లో పిటిషన్ దాఖలైనా దాన్ని హైకోర్టు 2017 లో కొట్టివేసింది2019 లో దాఖలైన మరో అప్పీలు కూడా కోర్టు తిరస్కరించింది. చివరకు క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న దరఖాస్తు కూడా తిరస్కరణకు గురైంది. ఈ విషయంలో మలేషియా అమానవీయంగా వ్యవహరించిందని నాగేంద్రన్ సోదరి షర్మిలా ధర్మలింగ్ ఆవేదన వెలిబుచ్చారు. నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని అంతర్జాతీయ సమాజం ఎంతగా ప్రాధేయపడినా సింగపూర్ ప్రభుత్వం కనికరించలేదు.
నాగేంద్రన్ ఉరిశిక్ష రద్దు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 29 న ఆన్‌లైన్ వేదికగా ఓ పిటిషన్‌పై 56,134 మంది సంతకాలు చేశారు. నాగేంద్రన్ మద్దతుదారులు, న్యాయవాదులు మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తికి మరణ శిక్ష అమలు చేయడం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం నిషేధమని పేర్కొన్నారు. అయితే నాగేంద్రన్ ఆరోగ్యపరిస్థితి సరిగ్గానే ఉందని, కోర్టులో అతడు చెప్పిన సాక్షాన్ని కోర్టు ఉదహరించింది. న్యాయ లోపానికి బలైన బాధితుడుగా నాగేంద్రన్ పేరు చరిత్రలో ఉంటుందని ప్రభుత్వేతర సేవా సంస్థ రిప్రైవ్ డైరెక్టర్ మాయా ఫో వ్యాఖ్యానించారు. నాగేంద్రన్, అతని తల్లి సోమవారం అపీలు దాఖలు చేశారు. మరణశిక్ష వైపు ముందుకెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
నాగేంద్రన్‌కు 2010 లో మరణ శిక్ష పడినప్పుడు అటార్నీ జనరల్‌గా ఎవరైతే ఉన్నారో అతనే ఇప్పుడు చీఫ్ జస్టిస్‌గా కోర్టు విచారణ చేపట్టడంతో విచారణ సరిగ్గా జరగలేదని ఆరోపించారు. ఇది సంఘర్షణాత్మకమని పేర్కొన్నారు. అయితే కోర్టు ఇవన్నీ వ్యర్ధారోపణలుగా తోసిపుచ్చింది. గత ఏడాది నవంబర్ 10 నే నాగేంద్రన్‌ను ఉరి తీయాల్సి ఉంది. అయితే అతను కరోనాతో బాధపడుతుండటంతో ఆలస్యమైంది. ఆ తరువాత అతను ఉన్నత కోర్టులను ఆశ్రయించడం, దానిపై విచారణలు జరగడంతో శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. నాగేంద్రన్ మృతదేహాన్నిమలేషియా లోని స్వంతస్థలం పెరక్‌కు తరలిస్తామని, అక్కడే అంత్యక్రియలు జరుగుతాయని నాగేంద్రన్ కుటుంబ సభ్యులు చెప్పారు.