డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం చలించిపోయేలా సంతాప సందేశాన్ని రాశారు. ఆయన మన్మోహన్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ తాను కారాగారంలో ఉన్నప్పుడు తన పిల్లలకు స్కాలర్‌షిప్ అందజేశారని అన్నారు. ప్రపంచ ఆర్థిక దిగ్గజ దేశాలలో భారత్ ఒకటిగా ఎదగడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ కారణమంటూ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాక ‘నా మిత్రుడా, నా సోదరుడా, మన్మోహన్’ అంటూ హృదయం చలించిపోయేలా రాశారు. మలేషియా ప్రధాని 1999 నుంచి 2004 వరకు జైలులో ఉన్నారు.అప్పట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.
అన్వర్ ఇబ్రాహీం ‘నా విషయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓ రాజనీతుజ్ఞడి కన్నా ఎక్కువే. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడ మా అనుబంధాన్ని మలేషియా ప్రజలకు కూడా తెలుపాలనుకుంటున్నాను. నేను కారాగారంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో దయచూపారు. నా పిల్లలకు స్కాలర్‌షిప్ అందేలా చూశారు. ముఖ్యంగా నా కుమారుడు ఇషాన్‌కు. నాడు నేడు చీకటి రోజులను గడిపాను. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఓ మిత్రుడిలా నన్ను ఆదుకున్నారు. అలాంటి గొప్ప గుణం చాలా మందిలో ఉండదు. నీ కోసం నా హృదయం ఎప్పుడూ పరితపిస్తుంది మిత్రమా, సోదరా, మన్మోహన్’ అంటూ రాశారు అన్వర్ ఇబ్రాహీం తన పోస్ట్‌లో.