Monday, December 23, 2024

ఇండియాకు ప్రతికూలంగా మాలె!

- Advertisement -
- Advertisement -

మన సైన్యాన్ని వెనక్కి పంపడానికి ఇటీవలే నిర్ణయం తీసుకొన్న మాల్దీవుల నూతన అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు మనతో కుదుర్చుకొన్న ఒప్పందాలను రద్దు చేసుకోడం ప్రారంభించారు. ముందుగా మనతో గల జల సర్వే (హైడ్రోగ్రఫీ)ఒప్పందాన్ని రద్దు చేసుకోడానికి నిర్ణయించినట్టు తాజా సమాచారం తెలియజేస్తున్నది.హిందూ మహా సముద్రం లోని బహుళ ద్వీప దేశమైన మాల్దీవులు మనతో చిరకాలంగా అనితర సాన్నిహిత్యం గల దేశం. ప్రధాని నరేంద్ర మోడీ 2019లో అక్కడకు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనకు అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సాగర జలాల్లో రవాణాను సమర్ధవంతంగా నిర్వహించడం కోసం సముద్రం లోతు, దాని గర్భం, తీరంలోని నేల లక్షణం, రవాణాకు జలాల్లో ఎదురయ్యే ఆవరోధాలు మున్నగు వాటిని ఈ సర్వే అధ్యయనం చేస్తుంది. ఈ ఒప్పందం కింద మాల్దీవులలో ఇంతవరకు అటువంటి మూడు హైడ్రోగ్రాఫిక్ సర్వేలను ఇండియా నిర్వ హించింది. గత అక్టోబర్ లో మాల్దీవుల అధ్యక్షుడుగా ఎన్నికైన ముయిజ్జు వెంటనే అక్కడి భారత సేనలను వెనక్కు వెళ్లిపోవాలని కోరారు.

విదేశీ సేనల ఉనికిని తాము కోరుకోడం లేదని ఆ మేరకు ఎన్నికల్లో ప్రజలకు తాను వాగ్దానం చేశానని ఆయన ప్రకటించారు. ఎన్నికైన తర్వాత ఇంకా అధికార బాధ్యతలు స్వీకరించకముందే అక్కడి భారత రాయబారిని కలుసుకొని ఒక్క ఇండియా సైనికుడూ మాల్దీవుల గడ్డ మీద ఉండరాదని ముయిజ్జు తెలియజేశారు. పూర్వపు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమేద్ సోలి 2018లో ఎన్నికైనప్పటి నుంచి భారత దేశంతో సన్నిహిత సమ్మంధాలు పెట్టుకోడం మొదలుపెట్టారు. నూతన అధ్యక్షుడు ఇందుకు పూర్తి విరుద్ధమైన వైఖరి తీసుకొన్నారు. ఇండియా కు బదులుగా చైనాతో బంధాన్ని పటిష్ఠం చేసుకోదలిచారు.ఇండియా కు ప్రాధాన్యం ఇవ్వడం మాల్దీవుల భద్రతకు ముప్పు అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మాల్దీవులకు చైనా విశేషంగా ఆర్ధిక సాయం చేసింది.అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా రుణాలిచ్చింది. హిందూ మహా సముద్ర జలాలపై, అందులోని నౌకల కదలికలపై నిఘా ఉంచడానికి ఉపయోగపడే కీలకమైన చోట ఈ దీవులున్నాయి. అందుచేత అభివృద్ధి సాయం కింద ఇండియా కూడా మాల్దీవులకు 2బిలియన్ డాలర్లు ఇచ్చింది. శ్రీలంక వంటి దేశాల మాదిరిగానే మాల్ దీవులు కూడా భారత చైనాలు రెండింటికీ అవసరం.

శ్రీలంకకు అప్పు ఇచ్చి చైనా దానిని రుణ బోనులోనికి నెట్టిన సంగతి తెలిసిందే. అది కూడా మాల్దీవుల మాదిరిగానే భారత చైనాల మధ్య ఆసులో కండెలా తిరగడానికి అలవాటు పడింది. మాల్దీవుల్లో భారత సేనల ఉనికి అక్కడి ప్రజల్లో ఇండియా వ్యతిరేక భావాలను అంకురింప జేసిందని భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు సోలిహ్ అవలంబించిన ఇండియా ఫస్ట్ విధానం క్రమంగా ఇండియా ఔట్ విధానంగా మారిపో యింది. మొన్నటి ఎన్నికల్లో ముయిజ్జు దీనిని పరాకాష్ఠకు తీసుకుపోయి విజయం సాధించాడు. వాస్తవానికి 1965లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందినప్పుడు మాల్దీవులను ముందుగా ఇండియాయే గుర్తించింది. 1988లో అక్కడ సంభవించిన సైనిక తిరుగుబాటు అణచివేతలో ఇండియా సైన్యం సకాలంలో తోడ్పడింది. 2013లో నియంత అబ్దుల్లా యమీన్ ఎన్నికల్లో గెలిచి అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇప్పటి మాదిరిగానే జరిగింది. ఆయన ఇండియాను దూరంగా పెట్టి చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొన్నారు. మాల్దీవుల్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు చైనా ఆర్ధిక సాయం చేసింది.1.5 బిలియన్ డాలర్లు సమకూర్చింది. 2018లో ఇది తారు మారయింది. ఇలా మాల్దీవులు కొంత కాలం అటు చైనాతో, ఇటు ఇండియా తోనూ మార్చి మార్చి మైత్రిని కొనసాగిస్తున్నది.

పాలకులు మారినప్పుడు దాని విధానం మార్పుకి గురి అవుతున్నది. సోలిహ్ మాల్దీవులకు అమెరికా కూడా విశేష ప్రాధాన్యం ఇస్తున్నది. 2020లో అమెరికా -మాల్ దీవుల మధ్య కొత్త రక్షణ ఒప్పందం కుదిరింది. మాల్దీవుల గత అధ్యక్షుడు ఇండియా ఫస్ట్ విధానాన్ని చేపట్టగా ముయిజ్జు చైనా ఫస్ట్ వైఖరిని తీసుకొంటారు అనిపిస్తున్నది. కాని తనది మాలే ఫస్ట్ విధానమని ఆయన ప్రకటించారు. 2013లో యమీన్ ప్రభుత్వం మానవహక్కులను ఉల్లంఘించిందనే కారణం చూపి అమెరికా, ఇండియాలు మాల్దీవులకు రుణ సదుపాయం నిరాకరించగా చైనా దానికి సహాయమందించి చేరువయ్యింది. ఇటువంటి దేశాలతో సంబంధాలు ఇంత సున్నితంగా ఉంటాయి. అందు చేత వాటితో మెలకువగా వ్యవహరించాలి. ప్రపంచ ప్రాబల్యం కోసం పోటీ అవధులు మీరిన వర్తమానంలో ఏ దేశం అవసరమైనా దాని వ్యూహాత్మక ప్రాధాన్యం పైనే ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News