మాలె: ప్రజాస్వామికంగా ఎన్నికైన మాల్దీవుల తొలి అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ నషీద్ గురువారం తన ఇంటి సమీపంలో జరిగిన ఒక పేలుడులో గాయపడ్డారు. ఆయనకు మాలెలోని ఒక ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించని పోలీసులు ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతోందని, సంఘటనా స్థలానికి ప్రజలెవరూ వెళ్లరాదని కోరారు. నషీద్‌కు ప్రాణాపాయం లేదని, పేలుడు సంఘటనపై దర్యాప్తునకు విదేశీ దర్యాప్తు సంస్థల సాయాన్ని ప్రభుత్వం కోరుతుందని మాల్దీవుల హోం మంత్రి ఇమ్రాన్ అబ్దుల్లా ఒక స్థానిక టెలివిజన్‌కు తెలిపారు.
30 ఏళ్ల నియంతృత్వ పాలన అనంతరం 2008లో మాల్దీవులలో జరిగిన తొలి ప్రజాస్వామిక ఎన్నికలలో దేశ అధ్యక్షునిగా 53 ఏళ్ల నషీద్ ఎన్నికయ్యారు. 2008 నుంచి 2012 వరకు అధ్యక్షునిగా కొనసాగిన నషీద్ ప్రజల ఆందోళన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. జైలు శిక్ష కారణంగా 2018 ఎన్నికలలో ఆయన పోటీకి అనర్హులయ్యారు. ఆ ఎన్నికలలో అధ్యక్షునిగా ఆయన పార్టీ సహచరుడు మొహమ్మద్ సోలి ఎన్నికయ్యారు. 2019లో పార్లమెంట్ స్పీకర్‌గా ఎన్నికైన నషీద్ దేశంలో ప్రముఖ నాయకునిగా కొనసాగుతున్నారు.