Saturday, November 9, 2024

మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బయటివారి జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బయటివారి జోక్యాన్ని తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చైనా గురువారం స్పష్టం చేసింది. అలాగే మాల్దీవులు తన సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్య్రాన్ని కాపాడుకునే విషయంలో ఆ దేశానికి మద్దతుగా ఉంటామని కూడా ప్రకటించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తొలిసారి చైనాలో పర్యటించిన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. తమ కీలక ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో పరస్పరం మద్దతును కొనసాగించుకోవాలని కూడా ఇరు పక్షాలు అంగీకరించినట్లు చైనా నేతలతో ముయిజ్జు చర్చలు ముగిసిన అనంతరం విడుదల చేసిన ఈ సంయుక్త ప్రకటన పేర్కొంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చైనా అనుకూల నేతగా గుర్తింపు పొందిన ముయిజ్జు ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఆ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను ముయిజ్జు తన మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేశారు.ఈ వివాదం నేపథ్యంలో వేలాది మంది భారతీయ పర్యాటకులు తమ మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు కూడా. కాగా ఒకే చైనా సూత్రానికి తాము గట్టిగా కట్టుబడి ఉన్నామని మాల్దీవులు స్పష్టం చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఒక్కటే మొత్తం చైనాకు ప్రాతినిధ్యం వహించే చట్టబద్ధమైన ప్రభుత్వం అని, తైవాన్ చైనా భూభాగంలొ అంతర్గత భాగం మాత్రమేనని స్పష్టం చేసింది.

కాగా బుధవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మధ్య చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చైనానుంచి మాల్దీవులకు పర్యాటకుల ను పెంచడానికి ఉద్దేశించిన ఒప్పందం కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఈ నెల 8న చైనా వచ్చిన ముయిజ్జు పర్యటన శుక్రవారం ముగియనుంది. గురువారం ఆయన చైనా ప్రధాని లీ క్వియాంగ్‌తో సమావేశమై మాల్దీవులలో చైనా చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల అమలుపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News