మాలే : మాల్దీవులు భారత్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 14 ఏళ్ల బాలునికి అత్యవసర వైద్యం అందడంలో తీవ్ర జాప్యం వల్ల ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భారత్ అందించిన ఎయిర్ క్రాఫ్ట్ వినియోగానికి సకాలంలో అనుమతి ఇవ్వక పోవడంతో బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడు మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న బాలుడ్ని రాజధాని మాలేకి తరలించడానికి ఎయిర్ క్రాఫ్ట్ కోసం బాలుని తల్లిదండ్రులు విల్మింగ్టన్ అనే దీవి లోని వారి ఇంటి నుంచి జనవరి 17న అభ్యర్థించగా, 16 గంటల తరువాత స్పందించారు.
ఎట్టకేలకు ఆ దేశ వైమానిక దళం మర్నాడు ఉదయం 8.30 గంటలకు స్పందించి బాలుడ్ని మాలేకు తీసుకెళ్లింది. అప్పటికే 16 గంటలు ఆలస్యం కావడంతో చికిత్సకు అవసరమైన కీలక సమయం దాటి పోయింది. ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అత్యవసర సమయాల్లో తరలింపు ప్రక్రియను మాల్దీవుల ప్రభుత్వం ఆసంధ కంపెనీ సంస్థకు అప్పగించింది. అయితే తాజా సంఘటనపై ఆ సంస్థ వాదన భిన్నంగా ఉంది. సమాచారం అందిన వెంటనే బాధితుడ్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించామని, కానీ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆలస్యమైందని వివరణ ఇచ్చింది. ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొంది.
ఈ సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దని ప్రకటన విడుదల చేసింది. మాల్దీవుల్లో అత్యవసర సమయాల్లో బాధితులను తరలించేందుకు భారత విమానాన్ని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం భారత్,మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడంపై స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. బాలుడి మరణంపై మాల్దీవుల ఎంపీ మీకెల్ నసీమ్ మాట్లాడుతూ “ భారత్ పట్ల అధ్యక్షుడి వ్యతిరేక వైఖరి కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.