Wednesday, January 22, 2025

మాల్దీవుల అధ్యక్షుడికి ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

మాలే మేయర్ ఎన్నికల్లో ఎండిపి గెలుపు

భారత అనుకూల అజీమ్‌కు అత్యధిక మెజార్టీ

తాజా వివాదాల నేపథ్యంలో కీలక పరిణామం

మార్చి 15లోగా సైన్యాన్ని వెనక్కి పిలవండి: భారత్ కు మాల్దీవుల తుది గడువు

మాలే : భారత వ్యతిరేకత, చైనా అనుకూలత రంగరించుకున్న మాల్దీవుల దేశాధ్యక్షులు మెహమ్మద్ ముయిజ్‌కు ఎన్నికల ఎదురుదెబ్బ తగిలింది. ఆయువుపట్టు వంటి రాజధాని మాలే మేయర్ ఎన్నికలలో మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండిపి) ఘన విజయం సాధించింది. ఈ పార్టీ భారతదేశ అనుకూల వైఖరిని అవలంభిస్తోంది. భారతదేశంతో మాల్దీవుల దౌత్య సంబంధాలు బెడిసికొడుతున్న దశలో శనివారం జరిగిన మాలే మేయర్ ఎన్నికల ఫలితం కీలక పరిణామం అయింది. ఎండిపి అభ్యర్థి ఆదం అజిమ్ మాలే నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ఈ పదవిలో ముయిజూ కొనసాగారు. గత ఏడాది దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పోటీ కోసం పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన మేయర్ స్థానం భర్తీకి జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఎండిపి, మేయర్ అభ్యర్థి అజిమ్ భారీ ఆధిక్యతతో గెలిచినట్లు స్థానిక మీడియా వార్తాకథనాలు వెలువరించింది.

ఎండిపికి భారత్ అనుకూలమైన మాజీ అధ్యక్షులు మెహమ్మద్ సోలీ నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రుల పరుషపదజాల విమర్శల దశలో వీటిని ఆయన ఘాటుగా తిప్పికొట్టారు. భారత్‌కు మాల్దీవులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇప్పటి మేయర్ ఎన్నికలలో అజిమ్‌కు మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు వచ్చాయి. కాగా ముయిజ్‌కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్‌సి) అభ్యర్థి అజిమా షకూర్ కేవలం 29 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు జరిగిన మేయర్ ఎన్నికల ఫలితాలతో దేశంలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంట్‌లో ఎండిపికి మెజార్టీ ఉంది. దీనితో జాతీయ స్థాయిలో ఏదైనా కీలక పరిణామానికి అవకాశం ఉంది. చైనాలో ఐదురోజుల పర్యటనను ముగించుకుని ప్రెసిడెంట్ ముయిజ్ శనివారం మాలే చేరుకున్నారు. ఆదివారం నాటి ఫలితాలపై స్పందించారు. విజయం సాధించిన అజిమ్‌ను అభినందించారు. మాలే పాలక మండలికి పూర్తి సహాయసహకారాలు ఉంటాయని ప్రకటించారు. ఈ విజయం ఏ ఒక్కరిది కాదని, మాలే నివాసితులు అందరిదీ అని స్పందించారు. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్కరోజు క్రితమే చైనా అధికార పర్యటన ముగింపు దశలో కూడా ప్రెసిడెంట్ ముయిజ్ భారతదేశ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే లైసెన్స్ ఎవరికి ఇవ్వలేదన్నారు.
మార్చి 15లోగా సైన్యం వెనక్కి తీసుకోండి
తమ దేశంలోని భారత సైనిక సిబ్బంది పూర్తి స్థాయిలో మార్చి 15 నాటికి వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షులు మెహమ్మద్ ముయిజు డెడ్‌లైన్ పెట్టారు. చైనాలో కీలక పర్యటన ముగించుకుని రాగానే ఆయన పరోక్షంగా భారత్‌కు అల్టిమేటం వెలువరించారు. ఇక్కడ భారతీయ సేనల అవసరం లేదని, దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం రెండు నెలలుగా చెపుతోంది. ఇప్పుడు తమ దేశాధ్యక్షులు ఈ ఉపసంహరణకు మార్చి 15వ తేదీని తుదిగడువుగా ఖరారు చేశారని ఆదివారం మాల్దీవుల సీనియర్ అధికారి అబ్దుల్లా నజీం ఇబ్రహీం మీడియా సమావేశంలో తెలిపారు. మాల్దీవుల్లో ఇప్పుడు 88 మంది భారతీయ సైనికులు ఉన్నారు.
భారత్, మాల్దీవుల దౌత్య స్థాయి భేటీ
కీలక విషయాలలో వివాదాలు బెడిసికొడుతున్న దౌత్య సంబంధాల నడుమ ఆదివారం ఇక్కడ కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవులు, భారత హైకమిషనర్ల ఉన్నతాధికారులు స్థానిక విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుత దౌత్య సంబంధాలలో తలెత్తిన క్లిష్టతలు, నివారణ అంశాలపై ఇరుపక్షాల నడుమ ఉన్నత స్థాయి చర్చలు జరిగినట్లు తెలిసింది. అయితే ఫలితం ఏమిటనేది వెంటనే స్పష్టం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News