జంషెడ్‌పూర్: కరెంట్ షాక్ కొట్టి ఒక మగ ఏనుగు మరణించడంతో ఈ మరణానికి మీరెంటే మీరు కారణమంటూ అటవీ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పరస్పరం నిందించుకోవడమే కాక విద్యుత్ ఇంజనీర్లపై అటవీ అధికారులు పోలీసు కేసు కూడా పెట్టారు. ఈ సంఘటన జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఖుంతి జిల్లాలోని రనియా పోలీసు స్టేషన్ పరధిలోగల కొయనారా గ్రామ సమీపంలోని అడవిలో నవంబర్ 14వ తేదీ రాత్రి ఒక ఏనుగు విద్యుదాఘాతానికి గురై మరణించింది.
గ్రామీణ విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కిందకు వేళ్లాడుతుండడం వల్లే ఏనుగు మరణించిందని అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తూ రనియా పోలీసు స్టేషన్‌లో జార్ఖండ్ విద్యుత్ శాఖకు చెందిన ఒక జూనియర్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దీనిపై విద్యుత్ శాఖ ఉద్యోగుల సంఘం ఇటీవల సమావేశమై తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అటవీ అధికారులు విద్యుత్ ఇంజనీర్లపై కేసు పెట్టారని ఆరోపిస్తూ వెంటనే పోలీసు కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడానికి తమ ఉద్యోగులు అవిశ్రాంతంగా కష్టపడుతుంటే తమ మీద పోలీసు కేసు నమోదు చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ఏనుగు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం వల్లే వైర్లు కింద పడ్డాయని, దీంతో కరెంట్ షాక్ కొట్టి ఆ ఏనుగు మరణించిందని ఆ గ్రామానికి చెందిన ప్రజలు తమకు చెప్పారని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఏనుగు మరణం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు శాఖల ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది.