Sunday, December 22, 2024

బ్యూటీ‘ఫుల్’గా కబ్జా

- Advertisement -
- Advertisement -

‘బాస్ చెప్పారు.. చేశాను.. బాస్ ఆదేశాల మేరకు ఒక్కరోజులోనే అనుమతులిచ్చాను’ ఇది హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ గతంలో చెప్పి న మాటలు. ప్రెస్ట్టీజ్ సిటీ (రాజేంద్రనగర్, గగన్‌పహాడ్ వద్ద) నిర్మాణాలకు సంబంధించి అనుమతుల విషయంలో అప్పట్లో హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారించిన తీరిది. దీంతో ప్రెస్ట్టీజ్ సిటీ యాజమాన్యం ప్రీలాంచ్ పేరుతో ఈ ప్లాట్లను వినియోగదారులకు విక్రయించినట్టు గతంలో ఆరోపణలు రావడంతో దానిపై రెరాలో పలువురు వినియోగదారు లు ఫిర్యాదులు సైతం నమోదు చేశారు. అయినా ఈ సంస్థ యాజమాన్యం తన వెనుక ఉన్న కొందరు ప్రజా ప్రతినిధుల అండతో ప్రీలాంచ్ పేరుతో ఈ కొనుగోళ్లను ముందుకు తీసుకెళుతుండడం విశేషం. అయితే ఈ కంపెనీ బెం గళూరుకు చెందినది కాగా, ఈప్రెస్ట్టీజ్ కంపెనీ గతంలోనే అనేక మంది కస్టమర్‌లను నగరంలోని వివిధ చోట్ల అపార్ట్‌మెంట్ నిర్మాణం పేరుతో మోసం చేసింది. గతంలో ఈ సంస్థ ప్రీలాంచ్ పేరుతో ఒక్కో ప్లాట్‌ను ఇద్దరికి అమ్మినట్టుగా ఫిర్యాదులు సైతం నమోదు కావడం విశేషం. ఈ సంస్థ ప్రస్తుతం సుమారుగా 50 ఎకరాల పైచిలుకు మల్గుడ్ చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణాలను చేపట్టినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైడ్రా దీనిపై దృష్టి సారిస్తే చెరువు కబ్జా గురించి తెలిసిపోతుందని, పూర్తి గా నిర్మాణాలు అయిన తరువాత కూల్చివేసే కంటే ముందుగానే హైడ్రా అధికారులు మేల్కొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

90 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో చెరువు
ది ప్రెస్టిజ్ సిటీ పేరుతో (రాజేంద్రనగర్, గగన్‌పహాడ్ వద్ద) ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయి. 81 టు 89 సర్వే నెంబర్, గగన్‌పహాడ్ పెద్ద చెరువు, గగన్‌పహాడ్ టు ప్రేమావతిపేట మధ్యలో (మల్గుడ్ చెరువు) వద్ద విల్లాలు, అపార్ట్‌మెంట్ నిర్మాణాలను ఈ సంస్థ చేపట్టింది. అయితే ఈ సంస్థ చేపట్టే నిర్మాణాలను ఆనుకొని 90 ఎకరాలకు పైచిలుకు విస్తీర్ణంలో మల్గుడ్ చెరువు ఉంది. అయితే హెచ్‌ఎండిఏ, డిటిసిపి లేఔట్‌లకు దగ్గరగా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి చెరువులు, కుంటలు ఉండరాదన్న నిబంధన ఉంది. ఆ చెరువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, దీనికోసం ప్రత్యేకంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసి తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయినా ఈ నిబంధనలను తుంగలో తొక్కిన ది ప్రెస్టిజ్ సిటీ యాజమాన్యం ఈ లే ఔట్ కోసం హెచ్‌ఎండిఏకు దరఖాస్తు చేసుకుంది.

మొదట్లో దీనికి అనుమతులు ఇవ్వరాదని హెచ్‌ఎండిఏ అధికారులు నిర్ణయించారు. కానీ, అంతలోనే కొందరు ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగి దానికి అనుమతులు వచ్చేలా చక్రం తిప్పినట్టుగా తెలిసింది. దీనికి తోడు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు భారీగా డబ్బులు ముట్టచెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు మల్గుడ్ చెరువు చెరువుకు సంబంధించి ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లను పరిగణలోకి తీసుకోకుండా అప్పటి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ది ప్రెస్టిజ్ సిటీకి ఎన్‌ఓసి ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ది ప్రెస్టిజ్ సిటీ అపార్ట్‌మెంట్‌లు నిర్మాణం జరుపుతున్న ప్రదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం బీర్ల కంపెనీ ఉండేదని, దానిని మూసివేయడంతో కొందరు ప్రజా ప్రతినిధులు చక్రం తిప్పి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలను సెటిల్‌మెంట్ చేసి ఆ యాజమాన్యాన్ని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసి ఈ స్థలాన్ని కబ్జా చేసి ది ప్రెస్టిజ్ సిటీ పేరుతో వెంచర్ చేస్తున్నట్టుగా తెలిసింది.

సుందరీకరణ పేరుతో చెరువు కబ్జా
అయితే ది ప్రెస్టిజ్ సిటీ యాజమాన్యం అనుమతుల కోసం మల్గుడ్ చెరువును సుందరీకరిస్తామని చెప్పి దానిని కూడా కబ్జాచేసి ఈ నిర్మాణాలను చేపడుతున్నట్టుగా ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అప్పటి హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అనుమతులపై సంతకం చేయడంతో పాటు ఈ చెరువు సుందరీకరణ అంశాన్ని కూడా ఆ ఫైల్‌లో చేర్చి దానికి అనుమతులు వచ్చేలా చేసినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ చెరువు చూడాలంటే ది ప్రెస్టిజ్ సిటీ అనుమతి కావాల్సి ఉండడంతో స్థానికులకు ఎంట్రీ లేకుండా పోయింది. ప్రస్తుతం ది ప్రెస్టిజ్ సిటీ (రాజేంద్రనగర్, గగన్‌పహాడ్ వద్ద) జరుగుతున్న నిర్మాణంలో ప్రజాప్రతినిధులు రంగంలో దిగడంతోనే దీనికి అనుమతులు త్వరగా లభించాయని, అందులో భాగంగానే ఒక్కో ప్లాట్‌ను కోటి పైచిలుకు విక్రయిస్తున్నారని, అలాగే ఒక్కో విల్లాకు రూ.7కోట్ల ధరకు ఈ సంస్థ అమ్ముతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వచ్చిన లాభాన్ని ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సి రావడంతో ఈ సంస్థ అధిక ధరకు ఈ విల్లాలను, ప్లాట్లను విక్రయిస్తున్నట్టుగా తెలిసింది.

సుమారుగా 50 ఎకరాల పైచిలుకు కబ్జా
మల్గుడ్ చెరువు మొత్తం 97 ఎకరాల 29 గుంటల విస్తీర్ణంలో ఉండేది. ఈ చెరువు సర్వే నెంబర్ 35 నుంచి 39 వరకు, అదేవిధంగా 42 నుంచి 48 వరకు, దీంతోపాటు 335, 336 సర్వే నెంబర్లలో రాజేంద్రనగర్ సర్కిల్ ప్రేమావతి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్ లో ఉంది. రికార్డులో 97 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ చెరువు క్షేత్రస్థాయిలో ప్రస్తుతం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ చెరువు 40 ఎకరాలు కూడా లేదని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే సుమారుగా 50 ఎకరాల పైచిలుకు చెరువును కబ్జా చేసి ఈ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

55 ఎకరాలు…8 బ్లాక్‌లు…
ప్రెస్టేజ్ సిటీ నిర్మాణ సంస్థ గగన్ పహడ్ లో సుమారు 55 ఎకరాల్లో ఈ నిర్మాణాలను చేపట్టింది. ఇందులో విల్లాలను, అపార్ట్‌మెంట్‌లను ఈ సంస్థ నిర్మిస్తుంది. అపార్ట్‌మెంట్‌లలో 2, 2.5, 3, 3.5, 4 బెడ్‌రూంల ప్లాట్‌ల నిర్మాణాన్ని, మొత్తం 8 బ్లాకులుగా 13 టవర్‌లుగా, ఒక్కో టవర్‌ను 42 అంతస్థుల్లో ఈ సంస్థ నిర్మాణం జరుపుతోంది. అపార్ట్‌మెంట్‌లను 31.14 ఎకరాల్లో 4,647 ప్లాట్‌లుగా నిర్మిస్తుండగా, 119 విల్లాలను 24 ఎకరాల్లోఈ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి 2027లో కొనుగోలుదారులకు అప్పగించాలని ఈ సంస్థ నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News