Friday, December 20, 2024

ఆ ఇద్దరు మహిళలను ఆదుకోని మణిపూర్ ప్రభుత్వం: డిసిడబ్లు చైర్‌పర్సన్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో నగ్నంగాఊరేగించి, అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం కాని, కౌన్సెలింగ్ కాని ఇప్పటివరకు అందలేదని, ఆ ఇద్దరు మహిళలు భయాందోళనలతో బతుకుతున్నారని ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్లు) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ వెల్లడించారు.

మణిపూర్‌లో బాధిత మహిళలను పరామర్శించిన ఆమె అక్కడి పరిస్థితులను వివరిస్తూ రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు లేదా సీనియర్ అధికారి ఎవరూ బాధిత మహిళలను కాని, డిసిడబ్లు సభ్యులను కలుసుకోలేదని ఆమె తెలిపారు. డిసిబ్లు సభ్యురాలు వందనా సింగ్‌తో కలసి సోమవారం మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌ను స్వాతి పర్యటించారు. ఇటీవల వైరల్ అయిన వీడియో ద్వారా వెలుగుచూసిన బాధిత మహిళలను, వారి ఆప్తులను పరామర్శించారు. తాము చురచంద్‌పూర్, మోయిరంగ్, ఇంఫాల్ జిల్లాలను పర్యటించి అక్కడి సహాయ శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

తమ పర్యటనకు కాని, బాధితులను కలుసుకోవడానికి కాని మణిపూర్ ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని స్వాతి తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలతోపాటు అందులో ఒకరి భర్తను, తల్లిని తాము కలుసుకుని మాట్లాడినట్లు ఆమె తెలిపారు. వారిలో ఒక మహిళను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేశారని, ఆమెను రక్షించడానికి ప్రయత్నించే క్రమంలో మూకల దాడిలో ఆమె భర్త, కుమారుడు హత్యకు గురయ్యారని స్వాతి తెలిపారు. మరో మహిళను నగ్నంగా ఊరేగించడంతోపాటు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె భర్త కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికుడిగా పోరాడారని ఆమె లెఇపారు.

ఆ ఇద్దరు మహిళలు ఇంకా ఆనాటి భయానక అనుభవం నుంచి తేరుకోలేదని, ఇప్పటికీ అదే భయంతో బతుకుతున్నారని స్వాతి తెలిపారు. బాధిత మహిళలకు న్యాయ సహాయం కాని, కౌన్సెలింగ్ కాని, కనీసం నష్టపరిహారం కాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదని, తమపై దాడి జరిగిన సమయంలో ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు చెప్పినట్లు ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News