Wednesday, March 26, 2025

మీ కుటుంబాల హవా నడుస్తోంది:మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ వివేక్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మల్లారెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. రాష్ట్రంలో మీ కుటుంబాల హవా నడుస్తోందంటే, కాదు మీదే నడుస్తోందని ఇరువురు పరస్పరం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో వీరిద్దరు ఎదురుపడ్డారు. అక్కడ వివేక్‌ను.. నమస్తే మంత్రి గారు.. అంటూ మల్లారెడ్డి పలకరించగా, అందుకు థాంక్స్ మల్లన్న అని వివేక్ వెంకటస్వామి పలకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కంటే ముందే ఢిల్లీకి వెళ్లి వచ్చారు అని మల్లారెడ్డి వ్యాఖ్యానించగా, అందుకు వివేక్ బదులిస్తూ తాను వేరే పని మీద వెళ్లి వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీదే హవా నడుస్తోందంటూ మల్లారెడ్డి కామెంట్స్ చేయగా.. బిఆర్‌ఎస్ హయంలో కెసిఆర్, మల్లారెడ్డిదే హవా నడిచిందని వివేక్ సమాధానం ఇచ్చారు. తాము అధికారం కోల్పోయాం తమదేం లేదన్న అంటూ మల్లారెడ్డి అనడంతో ఇద్దరు నేతల మధ్య నవ్వులు పూశాయి.

అప్పటి అసెంబ్లీ సమావేశాలు బాగుండేది
అప్పటి అసెంబ్లీ సమావేశాలు.. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మల్లారెడ్డి చెప్పారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. పార్లమెంట్‌లో ఆనాడు మాజీ ప్రధాని వాజుపేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు అత్తుకుని పోయేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీలో కెసిఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని, కానీ.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో మాత్రం బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News