Sunday, January 19, 2025

సైకిల్ వైపు మల్లారెడ్డి చూపు!

- Advertisement -
- Advertisement -

టిడిపిలో చేరికకు రంగం సిద్ధం
చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు
అప్పగించే అవకాశం ఆస్ట్రేలియా
పర్యటనలో ఉన్న మాజీ మంత్రి
హైదరాబాద్ రాగానే కీలక
పరిణామాలు

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరికకు రం గం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మల్లారెడ్డి తిరిగి రా గానే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి , టీడీపీ అధినేత నారా చంద్ర బాబు సమక్షంలో తరువాయి టీడీపీ కండువా కప్పుకోనున్నారని ఈ వర్గాల సమాచారం. మల్లారెడ్డి పార్టీలో చేరగానే ఆయనను తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షునిగా నియమించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే మల్లారెడ్డితో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చర్చించినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ టీడీపీ పూర్తిగా ఉనికికోల్పొయిన విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో టిడీపీ తిరిగి అధికారంలోకి రావడంతో తెలంగాణ లో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

ఆ దిశగా ఇటీవల తెలంగాణ టీడీపీ నాయకులతో చంద్రబాబు నాయుడు పలుమార్లు సమావేశమై చర్చించారు. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఆర్థికబలం కలిగిన మల్లారెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పితే పార్టీకి పూర్వవైభవం తీసుకరావడానికి కలిసి వస్తుందని చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నాయకులను పక్కన బెట్టి బీసీ కార్డును ప్రయోగించి పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు భావించారు. ఈ మేరకు టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్య తమ పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు కండ్ల సిద్ధాంతం నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరి దాకా చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టీడీపీకి ఆంధ్రపార్టీగా ముద్రపడటంంతో ఆ పార్టీ ఇక్కడ తన ఉనికిని కోల్పోవలసి వచ్చింది.

ఇలా ఉండగా తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారం లోకి రావడంతో మల్లారెడ్డి భూకబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దీంతో రాజకీయాలకంటే తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని భావించిన మల్లారెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీ జేపీలో చేరడానికి ప్రయత్నించి భంగపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండటం, దానికి టీడీపీ మద్దతు కీలకంగా మారడంతో కేంద్రప్రభుత్వ పెద్దల వద్ద చంద్రబాబు నాయుడికి పలుకుబడి పెరిగింది. దొడ్డిదారిలో అయినా కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు పొందాలంటే టీడీపీలో చేరడం ఉత్తమమని మల్లారెడ్డి అంచనా వేసారు. తన విద్యా సంస్థలు, ఇతర వ్యాపారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను తప్పించుకోవడంతో చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సత్సంబంధాలు ఉండటంతో కాంగ్రెస్‌లో చేరడం కంటే టీడీపీలో చేరడం వల్ల అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండింటికీ టార్గెట్ కాకుండా తప్పించుకోవచ్చని మల్లారెడ్డి వ్యూహత్మకంగా టీడీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఈ మేరకు తన ఆసక్తిని చంద్రబాబు నాయుడిని కలిసి మల్లారెడ్డి చెప్పడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇందులో భాగంగా మల్లారెడ్డి టీడీపీలో చేరిక, తెలంగాణ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనప్రాయమే అని ఈ వర్గాల సమాచారం. విద్యాసంస్థల అధిపతి, వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి గతంలో టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే . ఆ తరువాత ఆయన బీఆర్‌ఎస్‌లో చేరి 2018లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కూడా అయ్యారు . మూడవసారి కూడా తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో మల్లారెడ్డి అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితోనే కయ్యానికి కాలు దువ్వారు. అయితే ఆయన అంచనాలు తలకిందులై రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి ఏకంగా సీఎం కావడంతో కేంద్రంలో ఎన్‌డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న టీడీపీలో చేరడం వల్ల తనకు రాజకీయంగా రక్షణ లభిస్తుందని మల్లారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మల్లారెడ్డి టీడీపీలో చేరబోవడానికి ఇదే ప్రధాన కారణమని అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా రెడ్డి సామాజిక వర్గానికే చెందినా మరో నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే తాను టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News