Thursday, January 23, 2025

హోంమంత్రిని చేస్తే కాంగ్రెస్‌లో చేరతా

- Advertisement -
- Advertisement -

మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే తానే హోం మంత్రి అయ్యేవాడినని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఏడాదికి నాలుగు సినిమాలు తీసేవాడినని, అలాగే ఓ శాటిలైట్ చానల్ పెట్టేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని తనకు హోం శాఖ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సిఎం దగ్గర ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ హాల్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరడానికి సిఎం రేవంత్ అంగీకరిస్తారా? అని మల్లారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వందశాతం సిఎం తనను రానివ్వరని ఆయన అన్నారు.

తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే మధ్యవర్తిత్వం చేయాలని జర్నలిస్టులను మల్లారెడ్డి కోరారు. హోంమంత్రి పదవి ఇచ్చేటట్లు సిఎంతో మాట్లాడాలని జర్నలిస్టులకు మల్లారెడ్డి సూచించారు. కాంగ్రెస్ హోంశాఖ ఇవ్వకపోతే ఎలా? వాళ్లు ఇవ్వకుండా నేను గుంజుకోలేను కదా అని మల్లారెడ్డి చమత్కరించారు. శాసనసభలో తనను ఎవరూ టచ్ చేయడం లేదని, ఒకవేళ తనను టచ్ చేస్తే ఒక్కొక్కరి సంగతి చెబుతానని ఆయన తెలిపారు. అప్పటి దాకా తన నోటికి తాళం వేసుకుని ఉంటానని, తన ఇంట్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసిన అధికారులే షాక్ అయ్యారన్నారు. ఒక్క రూపాయి కూడా ఐటీ వాళ్లకు దొరకలేదన్నారు. డబ్బులు ఏమయ్యాయని అధికారులు నోరెళ్లబెట్టారన్నారు. ఇండియాలో మల్లారెడ్డి ఒక్కడే ఇన్కమ్ ట్యాక్స్ అధికారిపై ఎఫ్‌ఐఆర్ చేయించారని, ఒక అధికారిపై కేసు పెట్టాలంటే దమ్ము

ఉండాలని మల్లారెడ్డి తనదైన స్టైల్‌లో పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లుగానే మల్లారెడ్డి ప్రవర్తన కూడా ఉంటుంది. ఏనాడూ ఆయన ఈ వార్తలను ఖండించిన దాఖలాలు కూడా లేవు. తాజాగా దానికి కొనసాగింపు అన్నట్లుగా మంగళవారం ఈ బిగ్ కామెంట్ చేశారు. పార్టీ మారే అంశంపై ఆయన బహిరంగంగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News