మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: కోట్ల రూపాయల విలువ చేసే భూమి పై గ త పదేళ్ల నుండి కోర్టు వివాదం నడుస్తుండగా ఆ భూమి తమదంటే తమదంటూ ఇరువర్గాలు రెచ్చిపోయారు. ‘నాట్ టూ ఇంటర్ ఫియర్ ఆర్డర్’ ఉంది .. ప్రత్యర్థులు రావద్దు అంటూ ఒక వర్గం వారు భూమిలోకి ప్రవేశించగా, ‘మా భూమిలోకి మీరు ఎలా వచ్చారు’ అంటూ మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ మల్లారెడ్డి కుటుంబ సభ్యులు గొడవలకు దిగారు. ఈ భూ వివాదం పేట్‌బషీరాబాద్ పో లీసులకు తలనొప్పిగా మారింది. శనివారం ఉదయం నుండి ఇరువర్గాలకు న చ్చచెప్పే ప్రయత్నం పోలీసులు చేసినా వినకుండా నినాదాలు చేస్తుండటంతో వారిని స్టేషన్‌కు తరలించి పరస్పర కేసులు నమోదు చేసిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.. కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల విలేజ్ సర్వేనెంబర్ 82, 83లో సుచిత్ర మిలిటరీ కాంపౌండ్‌వాల్ రోడ్డులో రెండు ఎకరాల 10 గుంటల స్థలంపై
మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, స్థానికంగా ఉండే 15 మంది సభ్యులకు వివాదం నెలకొంది. ఈ స్థలంపై పదేళ్ల నుంచి వివాదం కోర్టులో నడుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎంపిగా, ఎంఎల్‌ఎగా, మంత్రిగా ఉండి అధికార బలంతో దౌర్జన్యం చేసి తమను భూమిలోకి రానివ్వలేదని ప్రత్యర్థులు కోర్టు ఆర్డర్ తెచ్చుకుని భూమిలోకి వెళ్లారు. అక్కడ తమ స్థలం ఉందంటూ కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా, రేకుల ఫెన్సింగ్ నిర్మాణం చేసి కంచె వేసుకున్నారు. ఈ విషయమై శనివారం ఉదయం తెలుసుకున్న మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా సిబ్బంది లేరని, తాము దర్యాప్తు చేస్తాం అంటూ పోలీసులు సమాధానం ఇచ్చారు.
దీంతో మల్లారెడ్డి తమ అనుచరులు, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు, మల్కాజిగిరి ఎంఎల్‌ఎ రాజశేఖర్ రెడ్డితో కలిసి స్వయంగా భూమి వద్దకు వెళ్లారు. అక్కడ అన్నీ కూల్చివేసి ఉండటంతో కోపంతో ఊగిపోయిన ఆయన ‘ఎవడురా కూల్చివేశారు.. పట్టుకోండి.. తర్మండి..’ అంటూ సిబ్బందికి, అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన వారు ప్రత్యర్థులు వేసిన షీట్లను పోలీసుల ముందే తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు అక్కడకు వచ్చి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవటంతో భారీ ఎత్తున బలగాలను దింపారు. పేట్ బషీరాబాద్ ఎసిపి రాములు ఆధ్వర్యంలో బందో బస్త్తు ఏర్పాటు చేసి దాడులు జరగకుండా ఉండేందుకు, ఆల్వాల్, సూరారం, శామీర్‌పేట, మేడ్చల్ సిఐలు, సిబ్బంది, ఎస్‌ఓటి పోలీసులు మోహరించారు. పరిస్థితి చేయి దాటుతుండగా మాజీ మంత్రి మల్లారెడ్డి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపటి తరువాత మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు తెగించి అయినా తమ భూమిని తాము కాపాడుకుంటామని, ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఎంఎల్‌ఎల భూమికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ ధ్వజమెత్తారు.
ప్రభుత్వంపై మల్లారెడ్డి ధ్వజం
పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతోనే తమ భూమిలో రౌడీలు అక్రమంగా ప్రవేశించడమే కాకుండా నిర్మాణాలను కూల్చివేశారంటూ ఎంఎల్‌ఎ మల్లారెడ్డి ఆరోపించారు. 10 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్న భూమిలో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి అక్రమంగా ప్రవేశించి, బీర్లు, బిర్యానీలు తెచ్చుకుని, వండుకొని తిని కత్తులు, కొడవళ్లు, తీసుకుని వచ్చి తమ భూమిలో అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా, రేకుల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విషయమై శనివారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సిబ్బంది లేరంటూ పోలీసులు సమాధానం ఇచ్చారని, దీంతో చేసేది లేక తానే స్వయంగా భూమి వద్దకు వచ్చారని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుడు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి అనే వాళ్ళు 8 నెలలు నుండి తన వద్దకు వస్తున్నారని, తాను సర్వే పెట్టు, టీపెన్ సర్వే చేసి తీసుకో అన్నానని, కానీ వాళ్ళు 100 మంది రౌడీలతో వచ్చి దౌర్జన్యం చేసి భూమిలోకి వచ్చి వాచ్‌మెన్ల ఫోన్లు లాక్కుని కబ్జాకు యత్నించారని మల్లారెడ్డి ఆరోపించారు.
మల్లారెడ్డి భూ మాయను అడ్డుకుంటాం
స్థలం యజమాని బషీర్ , బాధితుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. తమ భూమిని ఎంఎల్‌ఎ మల్లారెడ్డి ఆక్రమించి పొజిషన్లో ఉన్నారని, ఈ విషయంపై వివాదం కోర్టులో ఉండటంతో పాటు తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై మల్లారెడ్డితో పలు రకాలుగా చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయిందని, భూకబ్జాదారుడైన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టేషన్ లో పోలీస్‌లు ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చిన అనంతరం మళ్లీ భూమి వద్దకు చేరుకోగా పోలీసుల సమక్షంలో రెవిన్యూ అధికారులు భూసర్వే నిర్వహించారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా భూమి ఎవరిది ఎక్కడ ఉంది.. ఎవరు కబ్జా చేశారు… అనేది తేలుతుందని ఇరువర్గాలు వేచి చూస్తున్నారు.