తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు, తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా అనకట్టు ఎమ్మెల్యే ఎపి.నందకుమార్ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి జెఈవో సదా భార్గవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు.
అనంతరం ఆలయం వెలుపల మల్లాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. టిటిడి బోర్డులో తనకు మొదటిసారి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా సేవ చేశానని, అయితే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య భక్తునిగా స్వామివారి భక్తులకు సేవ చేస్తానని మల్లాడి తెలిపారు.
ఆ తరువాత ఆలయం వెలుపల ఎపి.నందకుమార్ మీడియాతో మాట్లాడారు. స్వామివారి అనుగ్రహంతో తనకు ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం వచ్చిందని, సాధారణ సేవకునిగా పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఇఒ రమేష్ బాబు, డెప్యూటీ ఇఒ (జనరల్) సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.