Saturday, November 23, 2024

రాజీవ్ రహదారిపై మల్లన్నసాగర్ భూనిర్వాసితుల ధర్నా

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధి ముట్రాజ్‌పల్లి క్రాస్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం మల్లన్నసాగర్ భూనిర్వాసితులు ధర్నాకు దిగారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన మమ్మల్నీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ప్యాకేజీ ఇవ్వలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిర్వాసితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు సింగాయపల్లి చౌరస్తా నుంచి ట్రాఫిక్‌ను మల్లీంచే ప్రయత్నం చేయడంతో గమనించిన నిర్వాసితులు సింగాయపల్లి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఎం కేసిఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో ఉన్నందున నిర్వాసితులు అటువైపు వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు సర్దిచెప్పినా వినకపోవడంతో ఏసిపి రమేష్ కలుగజేసుకొని రెవెన్యూ అధికారులను పిలిపించి భూ నిర్వాసితుల హామీలను నెరవేర్చేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు వెనుదిరిగారు.
ప్రజా ప్రతినిధుల మాటతో ఖాళీ చేశారు : ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి
మా సమస్యలపై అధికారులను నిలదీస్తే అన్ని విధాలా ప్యాకేజీ లు ఇచ్చిన తర్వాతనే ఖాళీ చేశారని, భూనిర్వాసితులు కలెక్టర్, అధికారులు చెప్తే ఖాళీ చేయలేదని, ప్రజా ప్రతినిధుల మాటతో ఖాళీ చేశారని ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. చెప్పుడు మాటలు నమ్మీ ప్యాకేజీతోపాటు ప్లాట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చే క్రమంలో నాన్‌లోకల్ అంటూ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. మా సమస్యలను నెరవేర్చని క్రమంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ప్రెండ్లీ పోలీస్‌కు నిర్వచనం ఏసిపి రమేష్ : సామాజిక కార్యకర్త బాలకృష్ణగౌడ్
పోలీసులు పలుమార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన మల్లన్నసాగర్ భూనిర్వాసితులు వినకపోవడంతో కలుగజేసుకున్న ఏసిపి రమేష్ నిర్వాసులతో రోడ్డుపై కూర్చొని మీ సమస్యలను రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని చెప్పడం ప్రెండ్లీ పోలీస్‌కు పరమార్ధంగా నిలిచాడని సామాజిక కార్యకర్త బాలకృష్ణగౌడ్ కొనియాడారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల బాధలు, సమస్యలు రోడ్డుపై కూర్చొని విన్న ఏసిపి రమేష్ ప్రెండ్లీ పోలీస్‌కు నిర్వచనంగా చెప్పుకోవచ్చన్నారు. క్లిష్ట సమయంలో సత్వర నిర్ణయం తీసుకొని ప్రజల పక్షాన నిలబడుతున్న ఏసిపి రమేష్‌కు బాలకృష్ణగౌడ్ కృతజ్ఙతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News