మన తెలంగాణ/హైదరాబాద్ : సాగునీటి చరిత్రలో నేడు ఒక చిర్మస్మరణీయమైన రోజు అని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ 50 టిఎంసి రిజర్వాయర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం, 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుందని తెలిపారు. రైతుల తలరాతను మార్చే ప్రాజెక్టుగా మల్లన్నసాగర్‌ను అయన అభివర్ణించారు. తరతరాలకు ఉపయోగపడే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని, తక్కువ సమయంలోనే గొప్ప పని మన కళ్లముందు సాక్షాత్కరించిందని తెలిపారు. సిఎం కెసిఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారమైందన్నారు. ఇటీవల సిఎం కెసిఆర్ మల్లన్నసాగర్‌ను హెలికాప్టర్‌నుంచి వీక్షించి మురిసిపోయారు. మల్లన్నసాగర్ పూర్తవ్వడమనేది ఒక అద్భుత ఘట్టమేనని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అన్నారు. మల్లన్నసాగర్ పూర్తి కావడంతో పాటు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండటంతో రైతులకు వరప్రదాయనిగా మల్లన్నసాగర్‌ను పేర్కొనవచ్చని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రైతన్నలకు సాగునీరు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న, చేయనున్న కృషికి ఈ మల్లన్నసాగర్ నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పేర్కొన్న మంత్రి కెటిఆర్ పూర్తయిన మల్లన్నసాగర్ అందచందాలతో కూడిన ఫోటోలను తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.