దేవరకొండ : నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి ఆర్‌ఐ పల్లా శ్రీనివాస్ రెడ్డి వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…మండల పరిధిలోని కేశ్యతండా గ్రామానికి చెందిన బాణావత్ లచ్చు అనే యువ రైతు నుండి దేవరకొండలోని డిండి ఎక్స్ రోడ్డు వద్ద రూ.30వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ కార్యాలయ ఆర్‌ఐ ఎసిబి బృందానికి పట్టుబడినట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎసిబి డిఎస్‌పి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాణావత్ లచ్చు తమ పెద్దమ్మ, పెదనాన్న మరణించడంతో వారి ఇద్దరి కుమార్తెల పూర్తి అంగీకారంతో కోల్ ముంతల్ పహాడ్ గ్రామ సర్వే నంబర్ 63/4లోని
ఒక ఎకరం వారసత్వ పట్టా మార్పిడి తన పేరు మీదకు చేయామని ఆర్‌ఐ శ్రీనివాస్ రెడ్డిని వారం రోజుల క్రితం అడిగాడు. ఈ పని చేయడానికి ఆర్‌ఐ రూ.30వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఈ విషయాన్ని తమకు ఫిర్యాదు చేయడంతో అన్ని సాక్ష్యాధారాలతో గురువారం మధ్యాహ్నం దేవరకొండలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నామని తెలిపారు. ఆర్‌ఐని తహశీల్దార్ కార్యాలయానికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ బి.వెంకటరావు, బి.రామారావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.