హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఫలితం దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్, నల్లగొండలో నిర్వహించిన కాంగ్రెస్ సభలకు ఖర్గే హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ పగబట్టారన్నారు. భారత దేశ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నివాసాన్ని ఈడీ స్వాధీనం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈడీ దాడులు చేసి దేశంతో పాటు తెలంగాణ ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కానీ, మోడీకి, బిజెపికి కాంగ్రెస్ పార్టీ భయపడదని ఆయన తేల్చి చెప్పారు. బ్రిటిష్ వాళ్లకే కాంగ్రెస్ భయపడలేదు, అలాంటిది మోడీకి భయపడుతుందా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పాలన తీసుకువస్తాం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టించింది ఇందిరాగాంధీ అని ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరాగాంధీ అని ఆయన గుర్తు చేశారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకం తీసుకువచ్చింది కూడా ఇందిరా గాంధీనేనని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పాలన తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదలకు, అణగారిన వర్గాలను ఆదుకోవడమే ఇందిరమ్మ రాజ్యం లక్షమన్నారు.