కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన పెన్షన్ స్కీమ్ యుపిఎస్ అసంబద్ధం, అణగారిన వర్గాలకు వ్యతిరేకం అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. యుపిఎస్‌లో తొలి అక్షరం యు కేంద్రంలోని మోడీ ప్రభుత్వపు యు టర్న్‌లకు తార్కాణంగా నిలుస్తుందని పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఏదో చేస్తామని, ఎవరినో ఉద్ధరిస్తామని తెలిపే మోడీ ప్రభుత్వం ఎప్పుడూ దీనిపై వెనుకంజలతోనే సరిపెట్టుకుంటుందని, ఈ విధంగా ఇది యూ టర్న్‌ల సర్కారు అయిందని అన్నారు. ఇప్పుడు తీసుకువచ్చిన యుపిఎస్ పూర్తిగా దళితులు, గిరిజనులు , వెనుకబడిన వర్గాలపై బహిరంగ దాడిగా మారుతోందని ఖర్గే వ్యాఖ్యానించారు. అయితే మోడీ అధికారపు జులుం పట్ల జనం స్పందన ఏ విధంగా ఉంటుంది? దీనిని ఏ విధంగా జనం తిప్పికొడుతారనేది ఇటీవలి ఎన్నికల ఫలితాల తరువాతి క్రమంలో స్పష్టం అయిందని ఖర్గే తెలిపారు.
మోడీ తనకు బలం ఉంది అనుకుని భ్రమలతో పలు బిల్లులు తీసుకురావడం, తరువాత వీటికి చుక్కెదురు తలెత్తడం ఇప్పుడు సంభవిస్తున్న పరిణామం అని ఖర్గే వివరించారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ / ఇండెక్సేషన్ ఉపసంహరణ, వక్ఫ్‌బిల్లును జెపిసి పరిశీలనకు పంపించాల్సి రావడం, ఐఎఎస్ నియామకాలలో లేటరల్ ఎంట్రీల నిర్ణయంపై తోకముడవడం వంటివి ఉదాహరణలు అని ఖర్గే తెలిపారు. ప్రజలు వెలువరించిన తీర్పు మోడీకి ఆయన పెత్తనానికి చెక్ పెట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ జాగరూకతతో ఉంటుంది. ఈ ప్రభుత్వం 140 కోట్ల మందికి జవాబుదారిగా , తీసుకునే నిర్ణయాలకు వివరణ ఇచ్చుకునేలా చేసి తీరుతుందని ఖర్గే స్పష్టం చేశారు. నిరంకుశ వాదపు సర్కారు మెడలు వంచేలా చేస్తుందని ఖర్గే హెచ్చరించారు.