Sunday, January 19, 2025

ప్రధాని మోడీ ఉద్యోగాల కల్పన ప్రకటనపై ఖర్గే

- Advertisement -
- Advertisement -

నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించడంతో ‘నిరుద్యోగిత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నవారి’ నోళ్లు మూతపడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరునాడు కాంగ్రెస్ ఆయనపై విరుచుకుపడింది. ప్రధాని ‘అబద్ధాల పుట్ట’ అని పార్టీ విమర్శించింది. ‘నరేంద్ర మోడీజీ! ఉద్యోగాల కల్పన గురించి మీరు శనివారం ముంబయిలో అబద్ధాలు చెప్పారు. జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఎ) ఏర్పాటును మీరు ప్రకటిస్తూ చెప్పిన మాటలను గుర్తు చేయదలచుకున్నాను. ‘కోట్లాది మంది యువజనులకు ఎన్‌ఆర్‌ఎ వరప్రదాయిని కాగలదు. ఈ సార్వత్రిక అర్హత పరీక్ష పలు పరీక్షల ఆవశ్యకతను తొలగించి, సమయాన్ని, వనరులను ఆదా చేస్తుంది. ఇది పారదర్శకతను కూడా పెంచుతుంది’ అని మీరు 2020 ఆగస్టులో చెప్పారు’ అని ప్రధానిని ఉటంకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఖర్గే ఆ తరువాత మూడు ప్రశ్నలు అడిగారు. ‘ఎన్‌ఆర్‌ఎ నాలుగు సంవత్సరాల్లో ఒక్క పరీక్షనూ ఎందుకు నిర్వహించలేదు? కేటాయించిన రూ. 1517 కోట్ల నిధిలో కేవలం రూ. 58 కోట్లను అది ఎందుకు ఖర్చు చేసింది? ప్రభుత్వోద్యోగాలకు నియామకాల నిమిత్తం ఎన్‌ఆర్‌ఎ ఏర్పాటైనది.

ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇడబ్లుఎస్ వర్గాల యువజనుల రిజర్వేషన్ హక్కుల కైవసానికి దానిని ఉద్దేశపూర్వకంగానే పని చేయనివ్వడం లేదా?’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ‘ఎక్స్’ పోస్ట్‌లో అడిగారు. పలు పోటీ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీక్ వివాదాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ, ‘పరీక్షల్లో అక్రమాలకు, ప్రశ్న పత్రాల లీక్‌కు ఎన్‌టిఎను వాడుకున్నారు. ఎన్‌టిఎ ఏ పరీక్షనూ నిర్వహించలేదు. విద్యా విధానాన్ని ధ్వంసం చేయాలని, యువజనుల భవితను అంతం చేయాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిన బూనాయి. ఎన్‌ఆర్‌ఎ అంశాన్ని గతంలో కూడా ప్రస్తావించాం. కానీ మోడీ ప్రభుత్వం మౌన దీక్ష బూనింది’ అని విమర్శించారు. 2023-24లో భారత్‌లో సుమారు 4.7 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) నివేదికను ప్రధాని ఉటంకించిన మరునాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విమర్శలకు దిగారు. రూ. 29 వేల కోట్లు విలువ చేసే మౌలిక వసతుల ప్రాజెక్టులను ముంబయిలో ప్రారంభించిన సందర్భంలో ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రతిపక్షాలు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రచారంలో నిరుద్యోగిత గురించి విస్తృతంగా ప్రస్తావించిన విషయం విదితమే, ‘ఉద్యోగాలపై తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నవారి నోళ్లు మూతపడేలా ఆ గణాంకాలు చేశాయి. తప్పుడు కథనాలు ప్రచారం చేసేవారు పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి, దేశ వృద్ధికి శత్రువులు. వారి ప్రతి విధానం యువతను మోసగించడం, ఉద్యోగాల కల్పనను అడ్డుకోవడం గురించే. ఇప్పుడు ప్రజలు వారి అబద్ధాలను తిరస్కరిస్తున్నందున వారి ఎత్తుగడలు బహిర్గతం అవుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News