న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకుగాను మల్లికార్జున ఖర్గే తన నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలో పెను మార్పు కోసం తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిక్షనాయకుడిగా ఉన్న ఆయనకు మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ, మరి 23 మంది మద్దతుపలికారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకె ఆంథోని, అశోక్ గెహ్లోత్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ తదితరులు బలపరిచారు.
‘‘నాకు మద్దతు ఇస్తున్న నాయకులు, మంత్రులు, ప్రతినిధులకు కృతజ్ఞతలు. అక్టోబర్ 17న ఫలితాలను చూద్దాం. గెలుస్తానన్న ఆశాభావం అయితే నాకుంది’’ అని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘‘నేను నా చిన్నతనం నుంచే కాంగ్రెస్ భావజాలానికి కట్టుబడ్డాను. నా 8-9 ఏళ్ల నుంచే నేను గాంధీ, నెహ్రూ భావజాలాన్ని ప్రచారం చేశాను’’ అని 80 ఏళ్ల ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ పునరుద్ధరణ కొనసాగతుందని కూడా ఆయన తెలిపారు.