న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వానికి ఉన్న సమయం అంతా రాజకీయ పార్టీలను చీల్చడానికే తప్ప ఆర్మీలోని ముఖ్యమైన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఉండదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ధ్వజమెత్తారు. ఆర్మీ లోని మేజర్, కెప్టెన్ స్థాయి ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆర్మీ తీవ్రమైన ఆఫీసర్ల కొరతతో ఉందన్న మీడియా వార్తల నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆఫీసర్లను కొత్తగా నియమించడానికి బదులు రిటైరైన వారినే తిరిగి నియమించడానికి ప్రభుత్వం చూస్తోందని మీడియా కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఆర్మీలో , సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ దళాల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశం సైనికుల కోసం వెచ్చించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనడానికి అగ్నిపధ్ స్కీమ్ స్పష్టమైన సాక్షంగా ఖర్గే పేర్కొన్నారు. ఓఆర్‌ఓపి అమలు ద్వారా రక్షణ వర్గాలను మోడీ ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు.