Monday, December 23, 2024

ప్రధాని మౌనం మణిపూర్‌కు ద్రోహం: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ రగిలిపోతూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దారుణం అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ప్రధాని మోడీ మణిపురిలను నమ్మించి ద్రోహం చేశారని, పైగా ఉలుకుపలుకులేని తనంతో పుండుపై కారం ఉప్పు చల్లుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్ర సంక్షోభం తలెత్తినప్పుడు మణిపూర్ ప్రజలకు ప్రధాని ఎంతో కొంత భరోసా కల్పించాల్సి ఉంది. అయితే ఇదేమీ చేయకుండా ఆయన ద్రోహానికి ఒడిగట్టారని తెలిపారు. కులాలు వర్గాల మధ్య మణిపూర్‌లో రగులుకున్న చిచ్చు ప్రాణనష్టానికి, ఆస్తుల ధ్వంసానికి దారితీసింది. చివరకు ఇది ఉగ్రవాదుల ఆగడాలకు కూడా ఆస్కారం కల్పించింది.

ప్రధాని మోడీ ఉపశమన చర్యలు తీసుకోలేదు సరికదా , కనీసం శాంతికోసం పిలుపు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీనిని ఏమనుకోవాలని ప్రశ్నించారు. అక్కడ హింసాకాండ చెలరేగి నెలరోజులు దాటింది. ఈ మధ్యనే హోం మంత్రిని అక్కడికి పంపించి ప్రధాని మోడీ చేతులు దులిపేసుకున్నారు. కానీ అమిత్ షా అక్కడ బసచేసి వచ్చిన కొద్ది రోజులకు తిరిగి హింసాకాండ చెలరేగిందని, పరిస్థితి ఎటు నుంచి ఎటు పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తరచూ ఈస్ట్ పాలసీ అంటుంటారు. ఈశాన్యానికి ఈ విధానం మంచిదంటారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఈ మౌనం ఎందుకు? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రస్తుత దారుణ పరిస్థితికి బిజెపి విధానాలే కారణం అని, ఈ కీలక ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కారణం కేవలం బిజెపి విభజిత రాజకీయాలే అని మండిపడ్డారు. ఇప్పటివరకూ ఘర్షణలలో కనీసం వంద మంది అయినా మృతి చెందారు. ఇప్పటికైనా ఈ సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితి సద్దుమణిగేలా చేయాల్సి ఉంది. లేకపోతే ఇది చేయిదాటి పోతుందని కాంగ్రెస్ నేత హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News