Sunday, January 19, 2025

ప్రజలను రెచ్చగొట్టడం మోడీకి అలవాటు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇండియా కూటమిలో భాగస్వాములైన ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యుబిటి) అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తదితరులతో కలసి శనివారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ ప్రధాన మంత్రి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించలేదని చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి పదేపదే మోడీ మాట్లాడుతారని, కాని ప్రజాస్వామ్య సిద్ధాంతాలను మాత్రం పాటించరని ఖర్గే విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యంలో రామాలయాన్ని బుల్‌డోజర్లతో కాంగ్రెస్ కూల్చివేస్తుందని, 370వ అధికరణను పునరుద్ధరిస్తుందని ప్రధాని మోడీ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తాము ఎవరిపైనా ఇప్పటివరకు బుల్‌డోజర్‌ను ఉపయోగించలేదని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ ఎన్నడూ చేయని పనుల గురించి, ఆచరణలో సాధ్యం కాని విషయాల గురించి అసత్యాలు చెబుతూ ప్రజలను రెచ్చగొట్టడం మోడీకి అలవాటుగా మారిందని ఆయన చెప్పారు.

370వ అధికరణపై కాంగ్రెస్ వైఖరి గురించి విలేకరులు ప్రశ్నించగా తాను మోడీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తమ మ్యానిఫెస్టోలో చేసిన వగ్దానాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. మోడీ ఎక్కడకు వెళ్లినా సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నించే విధంగా ప్రసంగిస్తారని ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోగా అభివర్ణించిన మోడీ ఇప్పుడు మావోయిస్టు మ్యానిఫెస్టో అంటున్నారని ఖర్గే అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత జిఎస్‌టి స్థానంలో సింగిల్ రేట్ జిఎస్‌టిని అమలు చేస్తుందని ఖర్గే తెలిపారు. ఆహార భద్రతా చట్టాన్ని తాము ప్రవేశపెడితే ఉచిత రేషన్ పరఫరా చేస్తూ అంతా తన ఘనతేనని మోడీ చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీతో పొత్తు విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని, తమ పార్టీ పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి కాదని ఖర్గే స్పష్టం చేశారు. మమతా బెనర్జీపై తనకు నమ్మకం లేదని, ఆమె బిజెపి పట్ల మొగ్గు చూపవచ్చని అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాను వెలుపలి నుంచి మద్దతిస్తానని మాత్రమే మమతా బెనర్జీ అన్నారని ఖర్గే గుర్తు చేశారు.

గతంలో కూడా అటువంటివి జరిగాయని, కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యుపిఎ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు వెలుపలి నుంచి మద్దతు ఇచ్చారని ఖర్గే గుర్తు చేశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలకు సంబంధించి ఏ విషయంపైనైనా తుది నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్టానమేనని, ఆ నిర్ణయాలను పాటించని వారు ఎవరైనా బయటకు వెళ్లక తప్పదని ఖర్గే స్పష్టం చేశారు. కాగా..ఇండియా కూటమి ప్రచార సభలలో పాకిస్తాన్ జెండాలను బిజెపి ప్రదర్శిస్తూ ఉద్యోగాలు వంటి ప్రజలు ఎందుర్కొంటున్న అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తోందని ఉద్దవ్ థాక్రే విమర్శించారు. శరద్ పవార్ మాట్లాడుతూ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అన్ని మత ప్రదేశాలను పరిరక్షించే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News