న్యూఢిల్లీ: మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘రాహుల్ గాంధీ ఆయన అమ్మ సోనియా గాంధీ వద్ద ఉంటారు, లేకపోతే నా బంగ్లాకు వచ్చి ఉండమంటాను’ అన్నారు. ఏప్రిల్ 22 లోగా ఇల్లు ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రటరియేట్ నోటీసు ఇచ్చింది. జెడ్ ప్లస్ రక్షణ ఉన్న రాహుల్ గాంధీ తన ప్రభుత్వ బంగ్లాలో 2005 నుంచి ఉంటున్నారు.
రాహుల్ గాంధీని బెదిరించడానికి, తక్కువ చేయడానికి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఖర్గే అభిప్రాయపడ్డారు. ‘ఆయనను(రాహుల్ గాంధీని) బలహీనపర్చడానికి వారు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆయన తన తల్లి దగ్గరికి పోయి ఉంటారు, లేక నా వద్దకు వస్తారు. అప్పుడు నేను నా ఇల్లు ఖాళీ చేసి ఆయనకు ఇస్తాను. భయపెట్టాలని, బెదిరించాలని, తక్కువ చేయాలని ప్రభుత్వం చేస్తున్న పనులను నేను ఖండిస్తున్నాను’ అన్నారు.
‘కొన్ని సందర్భాల్లో మేము మూడు నాలుగు నెలలు ఇల్లు లేకుండానే నివసిస్తాము. నా వరకైతే నాకు ఇల్లు ఆరు నెలలకు ఇచ్చారు. వారు ఇతరులను అణచివేయడానికి ఇలా చేస్తుంటారు. ఇలాంటి దృక్పథాన్ని నేను ఖండిస్తున్నాను’ అన్నారు. దీనికి ముందు కాంగ్రెస్ నాయకుడు, కమిటీ సభ్యుడు అయిన మాణికం ఠాగూర్ సైతం ప్రభుత్వ నిర్ణాయాన్ని విమర్శించారు. ఆయన నరేంద్ర మోడీ తీరును తూర్పారపట్టారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.