హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి డిక్లరేషన్‌ను ప్రకటించనుంది. ఈ సభకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే హాజరు కానున్నారు. ఈ సభ ఏర్పాట్ల కోసం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక కమిటీ వేశారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేయనుంది. ఈ సభలోనే మాజీ మంత్రి చంద్రశేఖర్, ఆర్మూర్ బిజెపి నేత వినయ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే విధంగా మైనార్టీ డిక్లరేషన్ రూపొందించేందుకు గాను మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పిసిసి మరో కమిటీని నియమించింది.
రేవంత్ సమక్షంలో పలువురి చేరిక
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ నియోజకవర్గానికి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో వీరికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో జడ్పిటీసీ సుమిత్ర, ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు జ్ఞానేశ్వర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, భీముడు, మాజీ ఎంపిపి పర్వతాలు,మాజీ సర్పంచులు యాదారెడ్డి, వంశవర్ధన్ రావు, బాలస్వామి, మల్లాచారి, వేణుగోపాల్ రెడ్డి, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.