Wednesday, January 22, 2025

ప్రియాంక గాంధీ ‘స్త్రీ శక్తి’: మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా ‘స్త్రీ శక్తి’కి ప్రతినిధి అని అభివర్ణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెను బ్రిటిష్ వారిపై పోరాడిన దిగ్గజాలు కిట్టూరు రాణి చెన్నమ్మ, ‘ఝాన్సీ కి రాణి’ లక్ష్మీ బాయ్‌లతో పోల్చారు. ఆయన రాహుల్ గాంధీని ‘యువ శక్తి’కి ప్రతీకగా శ్లాఘించారు. బెలగావిలో ‘గాంధీ భారత్’ కార్యక్రమంలో ఖర్గే ప్రసంగిస్తూ, బెలగావిలో నిర్వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం శతవార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలియజేశారు. మహాత్మా గాంధీ 1924లో వృద్ధ పార్టీ అధ్యక్షునిగా బెలగావి సమావేశానికి అధ్యక్షత వహించారు. ‘కిట్టూరు రాణి చెన్నమ్మ’ ఉంటే ఆమె ప్రియాంక గాంధీ. ‘ఝాన్సీ కి రాణి’ ఉంటే ఆమె ప్రియాంక గాంధీ. ప్రియాంక ఎంతో దృఢచిత్తురాలు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఆమె కుటుంబానికి స్థిరత్వం తెచ్చారు.

మాకు (ప్రియాంక గాంధీలో) స్త్రీ శక్తి, రాహుల్ గాంధీలో యువ శక్తి ఉన్నారు’ అని ఖర్గే పేర్కొన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ఇతివృత్తంగా గల ఈ కార్యక్రమం ఇటీవల రాజ్యసభలో భారత రాజ్యాంగాన్ని, దాని రూపశిల్పి బిఆర్ అంబేద్కర్‌ను ‘అవమానించినందుకు’ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను లక్షంగా చేసుకున్నది. కేంద్ర మంత్రి ఆ ఆరోపణను ‘అబద్ధం’గా తోసిపుచ్చారు. ‘భారత్ కోసం జీవించాలని, భారత్ కోసం మరణించాలని కోరుకుంటున్నాను’ అని బెలగావిలో గాంధీజీ చేసిన ప్రముఖ ప్రకటనను ఖర్గే గుర్తు చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కార్ శిష్యుడు అని ఖర్గే అన్నారు. గాంధీ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా గౌరవం ప్రదర్శిస్తున్నా వారు వాస్తవంగా గాడ్సేను పూజిస్తారని ఆయన ఆరోపించారు.

జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార పటేల్ మధ్య, గాంధీ. అంబేద్కర్ మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపిస్తూ బిజెపి ‘ఒక నాటకం ఆడుతోంది’ అని కూడా ఖర్గే విమర్శించారు. అంబేద్కర్ ఓడిపోయేలా చేసి ఆయనను కాంగ్రెస్ అవమానించిందన్న బిజెపి ఆరోపణను ఖర్గే తోసిరాజంటూ, అంబేద్కర్ తన మిత్రుడు కమలాకాంత్‌కు రాసినట్లుగా పేర్కొంటున్న ఒక లేఖను జనానికి చూపారు. సావర్కార్, ఎస్‌ఎ డాంగే తన ఓటమికి బాధ్యులని అంబేద్కర్ ఆ లేఖలో రాశారని ఖర్గే తెలిపారు. ఎన్నికల్లో అంబేద్కర్ విజయానికి తోడ్పడింది కాంగ్రెసేనని ఖర్గే చెప్పారు. దేశంలో మసీదుల సర్వేల గురించి ఖర్గే ప్రస్తావిస్తూ, ‘బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మసీదుల దిగువన ఆలయాల ఆచూకీ తీస్తున్నాయి. అవి ఎందుకు ఆ పని చేస్తున్నాయి? అది దేశ సమైక్యతకు ప్రమాదకరం కనుక అవి పశ్చాత్తాపం చెందుతాయి’ అని ఖర్గే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News