స్వతంత్ర భారత చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు
ఇసి-పిఎంఓ చర్చలపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పిఎంఓతో మాట్లాడారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని ఎలా నమ్మగలం? అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, వారితో పిఎంఓ ఎలా మాట్లాడిందని ఆయన ప్రశ్నించారు. ఇలా జరిగితే ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో తమకు న్యాయం జరుగుతుందని ఎలా ఆశించగలమన్నారు. కాగా స్వతంత్ర భారతంలో ఇలాంటిది ఎప్పుడూ వినలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ను తమ విధేయ సంస్థగా దిగజార్చడం ద్వారా మోడీ ప్రభుత్వం ప్రతి వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని మరో సారి రుజువైందన్నారు.