Wednesday, January 22, 2025

మణిపూర్‌ను బిజెపి దారుణంగా దెబ్బ తీసింది: మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో పరిస్థితిపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ వల్ల అసంఖ్యాక ప్రజల జీనవం దెబ్బ తిని తొమ్మిది మాసాలు అయిందని, కానీ ఆ రాష్ట్రాన్ని సందర్శించే తీరిక ప్రధాని నరేంద్ర మోడీకి లేకపోయిందని ఖర్గే విమర్శించారు. బిజెపి ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం మణిపూర్ ప్రజలను దారుణంగా దెబ్బ తీసిందని కూడా ఖర్గే ఆరోపించారు. ‘మణిపూర్‌లో నిరంతరాయంగా హింసాకాండ అసంఖ్యాక ప్రజల జీవితాలను నాశనం చేసి తొమ్మిది నెలలు అవుతోంది. అయినా ఆ రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని కనీసం ఒక గంట కూడా తీరిక చిక్కలేదు. ఎందుకు ? ఆయన చివరి సారిగా 2022 ఫిబ్రవరిలో మణిపూర్‌ను సందర్శించారు. అదీ ఎన్నికల ప్రచారం కోసమే. ఆయన ఇప్పుడు మణిపూర్ ప్రజలను వారి మానాన వదలివేశారు’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ‘ఎక్స్’లో విమర్శించారు.

నిరుడు మే 4 దరిమిలా 200 మందికి పైగా మరణించారని, 60 వేల మంది నిర్వాసితులయ్యారని ఆయన ఆరోపించారు. ‘తగిన వైద్య సౌకర్యాలు, ఆహారం లేకుండానే దుర్భర పరిస్థితులతో సుమారు 50 వేల మంది సహాయ శిబిరాలలో మగ్గుతున్నారు. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వారి ఇళ్లు, జీవనోపాధి, వస్తువులు నష్టపోయారు. వారికి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నది’ అని ఖర్గే ఆరోపించారు. కొన్ని నివేదికల ప్రకారం, ఒక్క చురాచంద్‌పూర్‌లో 80 మందికి పైగా ప్రజలు ట్రామా, పౌష్టికాహార లేమి, అనారోగ్యం కారణంగా శిబిరాలలో మరణించారని ఆయన తెలిపారు. ఇంఫాల్ శిబిరాలు కూడా మెరుగ్గా లేవని ఆయన ఆరోపించారు. శిబిరాలలో ఏదైనా సహాయం అందింది అంటే ధర్మదాతలు, ఎన్‌జిఒల పుణ్యమేనని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రం కాదని ఖర్గే అన్నారు. మణిపూర్‌లో మామూలు పరిస్థితులు, శాంతి ఎప్పుడు నెలకొంటాయో కూడా తెలియదని ఖర్గే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News