Wednesday, January 22, 2025

గతి లేకే కచ్చాతీవు ప్రస్తావన

- Advertisement -
- Advertisement -

శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. మోడీ తన పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి ఎందుకు చర్యలు గైకొనలేదని ఖర్గే ఆదివారం ప్రశ్నించారు. ‘గతి లేకే’ మోడీ ఎన్నికలకు ముందు ఈ‘సున్నితపు’ సమస్యను లేవదీస్తున్నారని ఖర్గే ఆక్షేపించారు. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో 20 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేసిన తరువాత చైనాకు ప్రధాని ‘క్లీన్ చిట్’ ఎందుకు ఇచ్చారని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు. 1974లో ఒక స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు కచ్చాతీవు దీవిని ఇవ్వడమైందని ఖర్గే తెలియజేశారు.

సరిహద్దు గ్రామాల మార్పిడిలో భాగంగా మోడీ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ పట్ల అటువంటి ‘స్నేహపూర్వక వైఖరి’ ప్రదర్శించిందని ఖర్గే గుర్తు చేశారు. ‘ప్రధాన్ మంత్రి నరేంద్ర మోడీజీ ! మీ పదవ సంవత్సరం దుష్పరిపాలనలో ప్రాంతీయ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై అకస్మాత్తుగా మేల్కొన్నారు. బహుశా ఎన్నికలు కారణం కావచ్చు. మీ నిస్పృహ కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది’ అని ఖర్గే ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. మోడీ 2015లో చేసిన ప్రకటనను ఖర్గే ఉటంకిస్తూ, ‘భారత్, బంగ్లాదేశ్ మధ్య భూ సరిహద్దు ఒప్పందం కేవలం స్థలం బదలాయింపు గురించి కాదు. అది హృదయాల భేటీ గురించి’ అని ప్రధాని అన్నారని తెలియజేశారు. ‘1974లో ఇందిరా గాంధీ చొరవను మీ సొంత ప్రభుత్వం గ్రహించినందుకు శ్లాఘిస్తూ 2015లో మీ సొంత ప్రకటన ఇది’ అని ఖర్గే పేర్కొన్నారు. ‘మీ ప్రభుత్వం కింద మైత్రీపూర్వక చర్యగా భారత్ నుంచి 114 ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు బదలీ చేయగా భారత్‌కు 55 ప్రాంతాలు వచ్చాయి’ అని ఆయన ఆరోపించారు. 1974లో ఒక మైత్రీపూర్వక వైఖరిగా కచ్చాతీవుపై అటువంటి ఒప్పందాన్ని మరొకచ దేశం శ్రీలంకతో కుదుర్చుకోవడమైంది’ అని ఖర్గే వివరించారు.

‘తమిళనాడులో ఎన్నికల జరగనున్న తరుణంలో మీరు ఈ సున్నిత అంశాన్ని లేవదీస్తున్నారు. కానీ, ‘కచ్చాతీవు 1974లో ఒక ఒప్పందం ద్వారా శ్రీలంకకు వెళ్లింది’ అని మీ ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి 2014లో సుప్రీం కోర్టులో చెప్పారు. దీనిని ఇప్పుడు ఎలా వెనుకకు తీసుకురాగలరు ? మీరు మళ్లీ కచ్చాతీవును కావాలని అనుకుంటే దానిని వెనుకకు తెచ్చుకోవడానికి మీరు యుద్ధం చేయవలసి ఉంటుంది’ అని ఖర్గే అన్నారు. ‘ఈ సమస్య పరిష్కారానికి, కచ్చాతీవును తిరిగి తెచ్చుకునేందుకు మీ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుందా అనేది మీరు చెప్పాలి ప్రధాని మంత్రీజీ’ అనిఖర్గే కోరారు. నేపాల్, భూటాన్, మాల్దీవులతో సహా ఇరుగు పొరుగు దేశాల విషయంలో ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని కూడా ఖర్గే ప్రశ్నించారు. ‘మీ విదేశాంగ విధానం వైఫల్యం కారణంగానే చరిత్రలో మొదటిసారిగా పాకిస్తాన్ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసింది’ అని ఖర్గే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News