వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలకు న్యాయ్(అందరికీ కనీస వేతనం) పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ అవిశ్రాంతంగా పనిచేసిన విప్లవ భూమిగా నాగపూర్‌ను ఆయన అభివర్ణించారు. దేశంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంతమైపోతుందని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోడీ సామాజిక న్యాయానికి, సమానత్వానికి బద్ధ విరోధిగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ముప్పునెదుర్కంటోందని, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకిందని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. వెనుకబడిన తరగతులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న కారణంతో దాదాపు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగ కాళీలను కేంద్రం భర్తీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళలతోసహా పేదవారందరికీ న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని, ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 6,000 అందచేస్తామని ఆయన తెలిపారు.
మహిళలపై అత్యాచారాలు జరిగిన మణిపూర్ రాష్ట్రాన్ని మాత్రం మోడీ సందర్శించలేదని, కాని వజ్రాలను నగిషీ పెట్టే భవనాన్ని ప్రారంభించడానికి మాత్రం సూరత్ వెళ్లారని ఆయన విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని ప్రధాని మోడీ పార్లమెంట్‌ను గౌరవించరని కూడా ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకింన ఇద్దరు చొరబాటుదారులకు అనుమతి పత్రంపై సంతకం చేసిన బిజెపి ఎంపీని కాపాడేందుకే 146 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమిని చీర్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, తామంతా సమైక్యంగా ఉంటే బిజెపికి పుట్టగతులు ఉండవని ఖర్గే అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపడేందుకు ప్రజలు ఇండియా కూటమిని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పక్కనపడేసి దేవుడిని ముఖ్యాంశంగా చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస గెలుపు పార్టీకి నైతిక మనోధైర్యాన్ని కల్పించాయని, ఇతర రాష్ట్రాలలో ఎదురైన ఓటములను చూసి కార్యకర్తలు కలత చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.