హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తామని, రైతు బంధు నిధులు, రైతుల ఖాతాల్లో జమ చేశామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎక్కువ విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికీ ఉపయోగం లేదని, ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని బిజెపి ఓట్లు అడగదని, కాంగ్రెస్‌పై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. కాంగ్రెస్ తమకు పోటీయే కదంటూనే పదేపదే విమర్శలు చేస్తోందని, కాంగ్రెస్‌కు భయపడుతున్నందునే పదే పదే ఆరోపణలు చేస్తున్నారని ఖర్గే చురకలంటించారు.
నల్లధనం వెలికితీస్తామని ఎన్నో ప్రగల్బాలు పలికారని, నల్లధనం ప్రయోజనాలను తమ మిత్రులకే అందజేశారని దుయ్యబట్టారు. లోక్ సభ ఎన్నికల ప్రకటనల తరువాత అదానీ, అంబానీ గురించి మాట్లాడటం లేదన్నారు. టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ఆరోపించడం సరికాదని సూచించారు. ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో బిజెపి వారు చూశారా? అని ప్రశ్నించారు. టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే ఐటి, కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానీ,అంబానీ నుంచి డబ్బులు వాళ్ల ఇళ్లలో ఐటి, ఇడిలు సోదాలు చేయాలన్నారు.
ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం ప్రధాని మోడీకి స్థాయికి తగదని ఎద్దేవా చేశారు. ధనవంతుల ఆస్తులు లాక్కొని పంచుతామనడం సిగ్గుచేటు అని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తించాలని, ఇందిరాగాంధీ హయాంలో భూ సంస్కరణలు తీసుకొచ్చామని, అభివృద్ధిని గాలికొదిలేసి విపక్షంపై ఆరోపణలే బిజెపి వాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టులు ఏం ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో చాలా ప్రాజెక్టులు ఇచ్చామని, కాంగ్రెస్ చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తోందని, ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేద మహిళలకు ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు.