Monday, December 23, 2024

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం:  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక ఊహించని ఫలితం కాదు. అంతర్గత ప్రజాస్వామ్యం నేతిబీరలో నెయ్యి మాదిరిగా వున్న పార్టీల్లో వాస్తవ అధినాయకత్వం ఎవరి చేతుల్లో వుంటుందో వారు కోరుకునే అభ్యర్థే ఎన్నిక కావడం రివాజు. ఇందుకు విరుద్ధంగా నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన పార్టీలు చాలా అరుదు. తన అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి పదవి పోటీలో పార్టీ అభ్యర్థి అయిన నీలం సంజీవ రెడ్డినే ఓడించిన ఇందిరా గాంధీ తడాఖా తెలిసిందే. అందుచేత పార్టీ మీద ఇప్పటికీ విశేషమైన పట్టు, పలుకుబడి వున్న సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీల దన్నుతో నిలబడిన మల్లికార్జున ఖర్గే గెలుపొందడం ఎంత మాత్రం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు.

వాలు ఈత గమ్యానికి చేర్చకపోతేనే వార్త అవుతుంది. మొత్తం 9500 మంది డెలిగేట్లలో 1000 మంది మినహా మిగతా వారు ఖర్గేకి అనుకూలంగా ఓటేసినట్టు తొలి వార్తలు చెబుతున్నాయి. కొన్ని ఓట్లు చెల్లకుండా పోయాయనీ తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా ఈ ఎన్నికలు జరిగి వుంటే ఆ వెయ్యి మంది కూడా అధిష్ఠాన అభ్యర్థికే ఓటు వేసి వుండేవారు. ఆ పార్టీ అధ్యక్ష పదవికి 24 ఏళ్ళలో మొదటి సారి జరిగిన ఎన్నికలుగా వీటికి ప్రత్యేక ప్రాధాన్యముంది. గాంధీల కుటుంబేతర అభ్యర్థుల మధ్య పోటీగా జరిగి, సోనియా గాంధీ తర్వాత ఆ పీఠానికి వారిలో ఒకరిని ఎన్నిక చేసుకోడం ఈ ఎన్నికలకు సంబంధించిన మరో ముఖ్యాంశం. ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని, తమ సొంత అభ్యర్థి అంటూ ఎవరూ వుండరని అధిష్ఠానం మొదటి నుంచి చెబుతూ వచ్చింది. ఆచరణలో మాత్రం తమకు విధేయులుగా వుండగల, తమ ఇష్టులైన అభ్యర్థుల కోసం అన్వేషణ నిరంతరం సాగించింది.

ఆ క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను సోనియా, రాహుల్ గాంధీలు ఎంచుకోడం, చెయ్యి తిరిగిన రాజకీయ నాయకుడు గెహ్లాట్ అందుకు సుముఖంగా వున్నట్టే వ్యవహరించి తెలివిగా, సులువుగా బరి నుంచి తప్పుకోడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన రాజస్థాన్ లెజిస్లేచర్ పార్టీలో తన ఎదురు లేనితనాన్ని పరోక్షంగా నిరూపించి అధిష్ఠానానికి నొప్పి కలగని ఇంజెక్షన్ ఇచ్చి తాను సిఎంగా కొనసాగడానికి అంగీకరించడం తప్ప వేరే మార్గం లేని స్థితికి దానిని నెట్టివేసిన ఉదంతం ఆదిలోనే ఈ ఎన్నికల ప్రక్రియకు హంసపాదుగా నిరూపించుకున్నది. ఆ తర్వాత తనంత తానుగా ముందుకు దూసుకు వచ్చిన దిగ్గీ రాజా బిరుదాంకితుడు దిగ్విజయ్ సింగ్‌ను పార్టీ నాయకత్వం తెలివిగా పక్కకు తప్పించి ఖర్గేను ఖరారు చేయడం వెనుక లోతైన ఆలోచనే వున్నది. తాను కూడా నిలబడతానని ఆసక్తి చూపి తనను కలిసిన శశిథరూర్‌ను ఆశీర్వదించి పంపించిన సోనియా గాంధీకి గతానుభవాలు ఆయన విధేయత మీద నమ్మకం కుదరనీయలేదని నిరూపణ అయిపోయింది.

80 ఏళ్ళ ఖర్గే కర్నాటకకు చెందిన దళిత అగ్ర నాయకుడు. నిజ లింగప్ప తర్వాత కర్నాటక నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైన రెండవ వ్యక్తి. ఓటమెరుగని వీరుడు(సొల్లిల్లద సరదార) గా ఆయనకు కన్నడలో బిరుదే వుంది. 50 ఏళ్ళ రాజకీయానుభవం గల నేత, కర్నాటక అసెంబ్లీకి వరుసగా 9 సార్లు ఎన్నికయ్యారు, 2009లో లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగు పెట్టి వరుసగా గుల్బర్గా (కలుబుర్గి) స్థానం నుంచి రెండు సార్లు ఎన్నికై ఆ సభలో పార్టీ నాయకుడుగా వ్యవహరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజ్యసభకు పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుపొందిన ఖర్గే గులాం నబీ ఆజాద్ తర్వాత అక్కడ ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతలు స్వీకరించి ఇటీవలి వరకు కొనసాగారు. దళిత నాయకుడుగా కంటే కాంగ్రెస్ పార్టీ మనిషిగానే గుర్తింపబడడానికి తాను ఇష్టపడతానని ఖర్గే చెప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన కుమారుడు ప్రియాంక ఖర్గే కర్నాటక శాసన సభ్యుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి.

ఆ విధంగా ఖర్గే కాంగ్రెస్ పార్టీకి, అధిష్ఠానానికి అత్యంత విధేయుడుగా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికతో సోనియా గాంధీ తనపై గల భారాన్ని దింపుకున్నారు అనే అభిప్రాయానికి తావిచ్చారు. కాని వాస్తవంలో ఆమె తన భారాన్ని కోల్పోలేదు, వదిలించుకోనూ లేదు. మూల విరాట్టుకు ఒక ఉత్సవ విగ్రహం మాత్రం వచ్చి చేరింది. ఏ పార్టీ నాయకత్వం మాటైనా ఆ పార్టీలో ఎదురులేకుండా కొనసాగాలంటే అది అధికారంలో వుండగానే సాధ్యమవుతుంది. రెండు వరుస పదవీ కాలాల తర్వాత ప్రధాని మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర నిరసన గూడుకట్టుకోడానికి అవకాశాలు ఏపుగా పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని ఆశించే వారికి కొంచెమైనా ఆశాభంగం కలిగితే ఆశ్చర్యపోవలసిన పని లేదు. కాని బిజెపి వద్ద గల పాచికలను, తంత్ర కుతంత్రాలను కాంగ్రెస్ ఇప్పటికైనా తట్టుకోగలుగుతుందా ప్రశ్న అదృశ్యం కాలేదు. అయితే అది లోక్‌సభలో గతంలో కంటే గణనీయంగా సీట్లు సంపాదించుకొన్నా దాని అధ్యక్షుడుగా ఖర్గేకు విలువ పెరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News