Monday, November 25, 2024

అరేబియా సముద్రంలో విదేశీ నౌక హైజాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐరోపా ద్వీపదేశమైన మాల్టాకు చెందినఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురయింది. సోమాలియాకు వెళ్తున్న ఎంవి రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు.ఆ నౌకనుంచి అత్యవసర పరిస్థితుల కాల్( మేడే కాల్) రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దాన్ని కాపాడేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ను, యుద్ధ నౌకను రంగంలోకి దించింది. ఈ మేరకు భారత నౌకాదళం శనివారం ఓ అధికార ప్రకటనలో తెలిపింది.‘ డిసెంబర్ 14వ తేదీ రాత్రి సమయంలో ఎంవి రుయెన్ నౌక యుకె మెరైన్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్‌లో మేడే(అత్యవసర పరిస్థితిని తెలియజేసే) కాల్‌ను పంపించింది. నౌకలోకి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారనేది ఆ సందేశం సారాంశం. దాంతో భారత నేవీ అప్రమత్తమైంది. అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న మారిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్,

గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్త చేసింది’ అని నేవీ తెలిపింది. హైజాక్‌కు గురయిన నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. నౌకపై వారు నియంత్రణ కోల్పోయినట్లు యుకె మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. రుయెన్ నౌకకు సాయం చేసేందుకు భారత నేవీ విమానం, యుద్ధ నౌక అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ నౌక సోమాలియా తీరం దిశగా పయనిస్తోంది. దానిపైనుంచే నేవీ విమానం ప్రయాణిస్తోంది. మరోవైపు శనివారం తెల్లవారుజామున భారత యుద్ధ నౌక విజయవంతంగా రుయెన్ నౌకను అడ్డగించినట్లు నేవీ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. 2017 తర్వాత సోమాలియా సముద్రపు దొంగలు జరిపిన అతిపెద్ద హౌజాక్ ఇదే. ఈ నేపథ్యంలో అరేబియా సముద్రంలో ప్రయాణించే నౌకలకు యుకె హెచ్చరికలు పంపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News