ఎన్నికల ప్రచారంలో మమత
సింగూర్ / గొగ్హట్ : బిజెపి నేతలు బెంగాల్‌లో ఓట్ల కొనుగోళ్లకు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారని టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఈ ధన ప్రవాహానికి కళ్లెం వేయాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని, ఈ అప్రజాస్వామిక చేష్టలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓ వైపు డబ్బులు గుప్పిస్తున్నారు. మరో వైపు ఓటర్లను భయభ్రాంతులను చేసేందుకు కిరాయి గూండాలను క్షేత్రస్థాయిల్లోకి దింపుతున్నారని ఇక్కడ జరిగిన ఎన్నికల సభలలో ఆరోపించారు. యుపి, బీహార్‌ల నుంచి గూండాలు బెంగాల్‌కు బిజెపి తరఫున వచ్చారని , ఎన్నికలలో ఏదో విధంగా అల్లర్లు సృష్టించాలని యత్నిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాల్సి ఉందన్నారు.
పలువురు బిజెపి నేతలు ఇప్పుడు హోటళ్లలో మకాం వేసి ఉన్నారని, దండిగా నోట్ల కట్టలతో సిద్ధం అయి ఉన్నారని, వారు ఓట్ల కొనుగోళ్లు, ఫిరాయింపుల పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం జాడ లేకుండా పోయిందని , ఎన్నికల దశలో వారి నాకాబందీలు ఎటుపొయ్యాయి? తనిఖీలు ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. నందిగ్రామ్‌లో తనపై దాడికి సంబంధించిన ఫక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఎవరెవరు ఈ దౌర్జన్యానికి దిగింది తెలిపే ఫోటోలు, వీడియోలు అన్నింటిని భద్రపర్చానని, ఈ అంశాన్ని తాను తగు విధంగా ఎన్నికల తరువాత ప్రస్తావిస్తానని వెల్లడించారు. సింగూర్, ధనియఖాళీ నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం మమత ఎన్నికల ప్రచారం సాగించారు.