దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్య
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మధ్య అంతర్గత విభేధాలు ఉన్నట్లు కనపడుతోందని అన్నారు. బుధవారం ముంబైలో శరద్ పవార్‌తో భేటీ అయిన మమతా బెనర్జీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించడంతోపాటు యుపిఎకి కాలం చెల్లిందని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రానున్న కాలంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎవరు ముందుకు వస్తారో తేలుతుందని ఫడ్నవీస్ అన్నారు. 2019లో బిజెపికి వ్యతిరేకంగా జతకట్టినప్పటికీ ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, అటువంటి కూటములను ప్రజలు అంగీకరించబోరని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఎవరు ఎవరితో జతకట్టినప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికలలో విజేత నరేంద్ర మోడీయేనంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.