Tuesday, November 5, 2024

కాంగ్రెస్ పై మమత శివతాండవం

- Advertisement -
- Advertisement -

Mamata lashes out at modi govt over pegasus spyware scandal

గత మేలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానంలో తమదే అసలైన కాంగ్రెస్ పార్టీ అన్నట్లు గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ రాజకీయ ఉనికిని ప్రశ్నార్ధకరం చేయడం కోసం ఆమె శివతాండవం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాజకీయంగా తమ పార్టీకి ఏ మేరకు ఉపయోగమో అని కాకుండా, కాంగ్రెస్‌ను ఏమేరకు బలహీనం చేయవచ్చో అనే ప్రాతిపదికనే పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకులను ఆహ్వానిస్తున్నారు. వారికి టిఎంసిలో కీలక ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే ‘ఫెడరల్ ఫ్రంట్’ పేరుతో బిజెపి, కాంగ్రెసేతర ప్రతిపక్షాలను ఒకచోటకు చేర్చి నాయకత్వం వహించే ప్రయత్నం చేశారు. అయితే నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి తిరిగి స్పష్టమైన ఆధిక్యతతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆమెకు అటువంటి అవకాశం రాలేదు. ఆ తర్వాత బిజెపి సహితం బెంగాల్ పై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఏ విధంగానైనా ఆమెను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా భారీగా వనరులను ఉపయోగించడమే కాకుండా, రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా ప్రయోగించింది. ఈ దాడిని సాహసంతో మమతా ఎదుర్కొని, విజయం సాధించారు.
ఈ ఎన్నికల ఫలితాలతో బిజెపి అగ్రనాయకత్వం ఆత్మరక్షణలో పడగా, నరేంద్ర మోడీ దూకుడుకు ఎదుర్కోగల నేత మమతా అనే సందేశం వెలువడింది. ఈ పరిణామమే సహజంగానే బిజెపి ఓటమి చెందితే తానే ప్రధాని కాగలనని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తీవ్ర నిరాశ కలిగించింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బిజెపి ప్రభుత్వం పడిపోతే, సహజంగా తానే ప్రధాని కాగలనని అనుకొంటున్న రాహుల్ ఏకపక్ష ధోరణులతో పార్టీలో సీనియర్ నాయకుల పట్ల అసహనంతో వ్యవహరిస్తున్నారు. 23 మంది సీనియర్ నాయకులు పార్టీలో సంస్థాగత సంస్కరణలు కోరుతూ సోనియా గాంధీకి రాసిన లేఖను బేఖాతరు చేయడం, పంజాబ్‌లో నిలకడలేని నవజ్యోత్ సింగ్ సిద్ధు సహచర్యంతో బలమైన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బైటకు వెళ్ళేటట్లు చేయడం ఆ విధంగా జరిగినవే.
తాజాగా మేఘాలయాలో17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది తృణమూల్ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. ఇప్పటికే బిజెపి పాలనలో ఉన్న గోవా, త్రిపురలలో అసంతృప్తి కాంగ్రెస్ నేతలను మమతా దగ్గరకు తీసుకొని, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతతో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తీశారు. మేఘాలయాలో కూడా పంజాబ్‌లో మాదిరాగానే జరిగింది. అక్కడ మరో 14 నెలల్లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, తానే తిరిగి ముఖ్యమంత్రిని కాగలగనని ధీమాతో ముకుల్ సంగ్మా ఎదురు చూస్తున్నారు. అయితే షిల్లాంగ్ ఎంపి విన్సన్ట్ పాలను ప్రదేశ్ కాంగ్రస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ చేయడం ద్వారా కాబోయే సిఎం అభ్యర్థి అతనే అన్న సంకేతం ఇచ్చారు.
రెండు దశాబ్దాల క్రితం బెంగాల్ లో చేసిన్నట్లుగా దేశంలో కూడా తమదే అసలైన కాంగ్రెస్ పార్టీ అనే సంకేతం 2024 ఎన్నికల సమయంకు ఇవ్వాలని మమతా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే త్రిపుర, గోవా సహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. మరో ఏడాది నాటికి దేశంలోని 15 రాష్ట్రాల్లో టిఎంసిని ప్రారంభించనున్నట్లు పార్టీ అధినేత మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపి అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. “మేము ఇప్పటికే త్రిపుర, గోవా రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాం. తొందరలోనే ఉత్తరప్రదేశ్, మేఘాలయ సహా మరో ఐదు రాష్ట్రాలకు పార్టీ కార్యకలాపాల్ని విస్తరిస్తాం. మరో ఏడాదిలో దేశంలోని 12 నుంచి 15 రాష్ట్రాలకు టిఎంసిని విస్తరిస్తాం’ అని రెండు నెలల ముందే ఆయన తమ కార్యప్రణాళికను వెల్లడించారు.
గుజరాత్, గోవా, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతామని కూడా చెప్పారు. బిజెపి ఎక్కడున్నా అక్కడికి వెళ్లి ఓడిస్తామని, అందుకోసం స్థానిక నేతలను, పార్టీలను సంప్రదిస్తామని కూడా తెలిపారు. అంటే ఒక విధంగా రాజకీయంగా కాంగ్రెస్‌ను ఏకాకిగా చేయడమే మమతా ఉద్దేశం అన్నట్లు భావించవలసి వస్తుంది.
కాంగ్రెస్ పై ఎందుకు ఇంత ఆగ్రహం!
కాంగ్రెస్ నుండి బైటకు వచ్చినా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గతంలో ఎన్‌డిఎ కూటమిలో చేరినా మమతా కాంగ్రెస్ అధినాయకత్వంతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకరం చేసే విధంగా ఆమె విజృంభించడానికి కూడా రాహుల్ గాంధీ కారణంగా కనిపిస్తున్నది. బెంగాల్ వెలుపల కాంగ్రెస్ ఓట్లను చీల్చకుండా మమతాను శాంతింప చేయడం కోసం ప్రియాంక గాంధీ వాద్రా ప్రయత్నించినా ఫలించలేదని తెలిసింది. బెంగాల్‌లో టిఎంసి విజయం తర్వాత రాహుల్ గాంధీ ప్రవర్తనపై ఆమె ఇప్పటికీ మండిపడుతున్నారు. బెనర్జీని అభినందించడానికి రాహుల్ ఫోన్ చేయలేదు. కనీసం ట్వీట్ చేయడానికి రెండు రోజులు పట్టింది. అయినప్పటికీ, మహాకూటమి గురించి మాట్లాడటానికి ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఆహ్వానించగానే ఆమె వెంటనే స్పందించారు. ఆమె ఢిల్లీలో సోనియాను గాంధీని కలసి మాట్లాడుతూ ఉండగా, గదిలోకి అకస్మాత్తుగా రాహుల్ ప్రవేశించి, కొద్దిసేపు ఉండడం ఆమెకు ఇబ్బంది కలిగించింది.
ఆ మరుసటి రోజు, కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి బెంగాల్‌లో హింసను పురికొల్పుతున్నట్లు టిఎంసిపై దాడిచేస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. బిజెపికి ప్రయోజనం కలిగించే ఈ ప్రకటన రాహుల్ అనుమతి లేకుండా ఇచ్చే అవకాశం లేదని ఆమె భావించారు. బెంగాల్‌లో టిఎంసిని కాకుండా వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం కోసం రాహుల్ మద్దతుదారులైన చౌదరి, అబ్దుల్ మన్నన్ టిఎంసి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నట్లు ఆమె గ్రహించారు. దానితో ఆమె వెంటనే ఉత్తరప్రదేశ్‌పై దృష్టి సారించారు. అక్కడ కాంగ్రెస్ కుటుంబమైన మాజీ ముఖ్యమంత్రి కమలాపతి త్రిపాఠి మనవడు రాజేష్ పతి, అతని ముని మనవడు లలితేష్ పతిలని టిఎంసిలో చేర్చుకున్నారు. అప్పుడే మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మిత దేవ్‌ను పార్టీలో చేర్చుకొని ఆమెకు రాజ్యసభకు పంపారు. అట్లాగే గోవాలో మాజీ ముఖ్యమంత్రి లుజోనాహో ఫ్లేయిరో కూడా కాంగ్రెస్ నుండి విడిచి టిఎంసిలో రాజ్యసభ సభ్యత్వం పొందారు.
కాంగ్రెస్‌ను కుప్పకూలే విధంగా చేయడంలో మమతకు సహకరిస్తున్న ఎన్నిక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహితం గత జూన్, జులైలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, 2024 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం కృషి చేస్తానని కూడా చెప్పారు. అతని సలహాతోనే పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌ను గద్దె దింపడం కాంగ్రెస్‌కు రాజకీయ ఆత్మహత్యగా మారింది. ప్రశాంత్ కు ఏ పదవి ఇవ్వాలనే విషయమై కాంగ్రెస్‌లో సమాలోచనలు జరుగుతున్న సమయంలో గతంలో అహ్మద్ పటేల్ నిర్వహించిన సోనియా రాజకీయ కార్యదర్శి పదవి ఇవ్వాలని, ఎన్నికల వ్యూహాలతో తన నిర్ణయమే చివరిదిగా ఉండాలని అంటూ షరతులు పెట్టారు. ఇది సహజంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఆగ్రహం కలిగించింది. ఆ పదవి ఇవ్వడంకు రాహుల్ సహితం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ప్రచారంలో కీలక భూమిక వహించిన ప్రశాంత్‌కు ఆయన ప్రభుత్వంలో ఆశించిన విధంగా కీలక భూమిక లభించకపోవడంతో బిజెపి వ్యతిరేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వీలయిన చోట్ల బిజెపిని అధికారానికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్‌లో నితీశ్ కుమార్ దగ్గరకు చేర్చుకొని, జెడియు జాతీయ ఉపాధ్యక్షునిగా చేస్తే, తిరిగి ఆయన బిజెపితో చేతులు కలపడంతో బైటకు వచ్చేశారు. మమతా రాజకీయంగా కలిగిస్తున్న నష్టాలను రాహుల్ గ్రహించినట్లున్నారు. ఇదివరకటి వలే ఏకపక్ష ధోరణి అవలంబించకుండా, రాజస్థాన్‌లో అశోక్ ఘేలాట్, సచిన్ పైలట్‌ల మధ్య సయోధ్య కుదిర్చి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కావించారు. బిజెపియేతర రాజకీయ పక్షాలు దాదాపుగా రాహుల్ నాయకత్వం పట్ల సుముఖంగా లేరు. మమతతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో మమతా -రాహుల్ వైరం ఎటువైపు మలుపు తిరుగుతాయో చూడవలసి ఉంది.

* చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News